అహ్మదాబాద్, ఏప్రిల్ 28: కొందరు బ్యాంకు ల నుంచి వేలకోట్ల అప్పులు చేసి ఎగ్గొట్టి దేశం నుంచి పారిపోతుంటే, మరోవైపు చిరు వ్యాపారులు, పేద రైతులు బ్యాంకుల వేధింపులకు గురవుతున్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఇలాంటి ఘటనే ఇప్పుడు సంచలనంగా మారింది. కేవలం 31 పైసలు అప్పు ఉన్నందుకు ఓ రైతుకు తన భూమికి సంబంధించిన నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వటానికి ఎస్బీఐ అధికారులు నిరాకరించారు. దీనిపై గుజరాత్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2000లో అహ్మదాబాద్ సమీపంలోని ఖోరజ్ గ్రామంలో షంజీభాయ్ అనే రైతు తన భూమిని విక్రయించాడు. ఆ భూమిపై అప్పటికే స్థానిక ఎస్బీఐ శాఖలో రూ.3 లక్షలు పంటరుణం తీసుకొన్నాడు. దీంతో భూమిని కొన్నవారికి రిజిస్ట్రేషన్ చేసేందుకు బ్యాంకు అధికారులు ఒప్పుకోలేదు.
షంజీభాయ్ లోన్ మొత్తం తీర్చేసినా రెండేండ్లుగా బ్యాంకు అధికారులు నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వలేదు. దీంతో భూమి కొన్న వ్యక్తులు హైకోర్టును ఆశ్రయి ంచారు. ఈ పిటిషన్ను గురువారం జస్టిస్ భార్గవ్ ఖరియా ధర్మాసనం విచారించింది. రైతుకు వెంటనే నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించింది. రైతు పేరుమీద ఇంకా 31 పైసలు అప్పు ఉన్నదని, అది చెల్లిస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని ఎస్బీఐ తరఫు న్యాయవాది వాదించారు. దీంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతును వేధించటం తప్ప ఇది మరొకటి కాదని వ్యాఖ్యానించారు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం 50 పైసలకంటే తక్కువ అప్పు ఉంటే లెక్కలోకి తీసుకోరాదని న్యాయమూర్తి గుర్తుచేశారు. తదుపరి విచారణకు మే 2కి వాయిదా వేశారు.