కొట్టాయం: గూగుల్ మ్యాప్స్(Google Maps) చూస్తూ డ్రైవింగ్ చేస్తున్న ఓ హైదరాబాదీ టూరిస్టుల బృందం తృటిలో భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. కేరళలో విహారానికి వెళ్లిన ఆ బృందం.. గూగుల్ మ్యాప్స్ చూస్తూ వాహనాన్ని నడిపారు. అయితే దక్షిణ కేరళలోని కురుప్పనతార వద్ద ఓ కాలువలోకి వాళ్లు ప్రయాణిస్తున్న వాహనం దూసుకెళ్లింది. ఆ వాహనంలో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. దాంట్లో ఓ మహిళ కూడా ఉన్నది.అలప్పుజా వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం కేరళలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో కాలువల్లోనూ నీటి ప్రవాహం అధికంగా ఉన్నది. అయితే వాళ్లు వెళ్తున్న రూటు గురించి పూర్తిగా అవగాహన లేకపోవడంతో ఆ టూరిస్టులు గూగుల్ మ్యాప్స్ ఫాలోఅయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి ఆదుకున్నారు. పెట్రోలింగ్ టీమ్‌తో పాటు స్థానికులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. హైదరాబాదీలు వెళ్లిన వాహనం నీటిలో పూర్తిగా మునిగిపోయింది. కానీ నలుగురూ సురక్షితంగా ఉన్నారు.