ఝాన్సీ: హఠాత్తుగా వచ్చిన పురిటి నొప్పులు భరించలేక రైల్వే స్టేషన్లో బాధతో అల్లాడుతున్న ఒక గర్భిణికి ప్రసవం చేసిన డాక్టర్‌ను ఆర్మీ చీఫ్ సహా పలువురు ప్రశంసిస్తున్నారు. ఎలాంటి వైద్య పరికరాలు లేకపోయినా కేవలం హెయిర్ క్లిప్, పాకెట్ నైఫ్‌తో డెలివరీ చేసి డాక్టర్ రోహిత్ బచ్వాలా తల్లీ బిడ్డలను బతికించాడు. ఝాన్సీ డివిజన్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక గర్భిణి పాన్వెల్-ఘోరఖ్పూర్ రైలులో ప్రయాణిస్తుండగా, ఆమెకు తీవ్రమైన పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఝాన్సీ రైల్వే స్టేషన్లో ఆమెను కిందకు దించారు.
సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లీ బిడ్డలను కాపాడిన హైదరాబాద్ ఆర్మీ డాక్టర్ రోహిత్ బచ్వాలాను భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రశంసించారు. బచ్వాలా వృత్తికి సంబంధించి సమయస్ఫూర్తిని ప్రదర్శించారని ప్రశంసలు కురిపించారు.