బుదాపెస్ట్: రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు .. యురోపియన్ యూనియన్ దేశమైన హంగేరీ(Hungary) జలక్ ఇచ్చింది. సహాయ నిధుల కింద ఉక్రెయిన్‌కు ఈయూ ఇవ్వాల్సిన సుమారు 50 బిలియన్ల పౌండ్లను హంగేరి అడ్డుకున్నది. వాస్తవానికి ఈయూ సభ్యదేశాల మధ్య జరిగిన ఒప్పందం సమయంలో సాయం గురించి సంతకాలు చేశారు. కానీ కొన్ని గంటల్లోనే హంగేరీ తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఉక్రెయిన్‌కు సాయం అందించాల్సిన అంశం గురించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఈయూ నేతలు చెప్పారు.
రష్యా అటాక్ తర్వాత నిధుల కోసం ఈయూ, అమెరికాపై ఉక్రెయిన్ ఆధారపడుతోంది. ఈయూలో ఉక్రెయిన్ సభ్యత్వం విషయంలో హంగేరి చాన్నాళ్ల నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే ఉన్నది. మరోవైపు బ్రసెల్స్‌లో జరిగిన సభ్యదేశాల మీటింగ్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వాగతించారు. అమెరికా నుంచి 61 బిలియన్ల డాలర్ల ప్యాకేజీ కోసం కూడా ఉక్రెయిన్ ఎదురుచూస్తోంది. ఆ ప్యాకేజీపై అమెరికా నిర్ణయం తీసుకున్నా.. డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య వాగ్వాదం జరుగుతోంది.