న్యూఢిల్లీ: సాహిత్యంలో విశేష కృషి చేసిన హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్నాహోర్కైని నోబెల్ బహుమతి వరించింది. ఆయన అద్భుతమైన, దార్శనిక రచనలకుగాను ఈ ప్రతిష్ఠాత్మక బహుమతి లభించినట్టు నోబెల్ కమిటీ ప్రకటించింది. క్రాస్నాహోర్కై సెంట్రల్ యూరోపియన్ సంప్రదాయంలో గొప్ప ఇతిహాస రచయితగా ప్రసిద్ధి చెందారు. 1954లో హంగేరిలోని గ్యులా అనే చిన్న పట్టణంలో జన్మించిన ఆయన 1985లో ‘సాటాన్టాంగో’ అనే తొలి నవల ద్వారా ప్రపంచ సాహిత్యంలో సంచలనం సృష్టించారు.
2015లో మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్, 2019లో నేషనల్ బుక్ అవార్డు వంటి అనేక అవార్డులు గెలుచుకున్నారు. ఆయన ప్రసిద్ధ నవలలైన ‘సాటాన్టాంగో’, ‘ది మెలన్కొలీ ఆఫ్ రెసిస్టెన్స్’ వంటివి చలన చిత్రాలుగా కూడా రూపొందాయి. స్వీడన్ రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం ఇచ్చే ఈ ప్రతిష్ఠాత్మక బహుమతి కింద విజేతకు 11 మిలియన్ల స్వీడిష్ క్రోనోర్ (సుమారు 1.2 మిలియన్ డాలర్లు), 18 క్యారెట్ల బంగారు పతకం, డిప్లొమా అందజేస్తారు. ఈ ఏడాది విజేతలకు డిసెంబర్ 10న అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ ఏడాది భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, వైద్యశాస్త్రంలో ఇప్పటికే విజేతలను ప్రకటించారు.