కాన్పూర్: రైల్లో బాలిక(11)పై రైల్వే కాంట్రాక్టు కూలీ ఒకరు లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన బాధితురాలి కుటుంబసభ్యులు, ప్రయాణికులు నిందితుడిపై దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం రాత్రి లక్నో-కాన్పూర్ మధ్య ప్రయాణిస్తున్న హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగిందని పోలీసులు శుక్రవారం తెలిపారు.
బీహార్‌కు చెందిన నిందితుడు ప్రశాంత్ కుమార్(34) బాధితురాలి కుటుంబంతో కలిసి సివన్లో రైలెక్కాడు. అతడు తన బెర్త్‌ను బాలికకు ఆఫర్ చేసి.. ఆమె తల్లి లేని సమయంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఈ విషయాన్ని తల్లికి తెలుపగా.. ఆమె ఈ విషయాన్ని తన కుటుంబానికి, ఇతర ప్రయాణికులకు తెలిపింది.
వారంతా కోపంతో నిందితుడిని తీవ్రంగా కొట్టారు. కాన్పూర్ సెంట్రల్ స్టేషన్లో రైల్వే పోలీసులు నిందితుడిని కస్టడీలోనికి తీసుకొన్నారు. అతడి ఆరోగ్యం క్షీణించడంతో దవాఖానకు తరలించారు. అక్కడ అతడు మృతి చెందాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.