న్యూఢిల్లీ : మానవుల గరిష్ఠ ఆయుష్షు 156 ఏండ్లు మాత్రమేనని.. అంతకు మించి జీవించలేరని ఎన్పీజే ఏజింగ్ అనే శాస్త్రీయ పత్రికలో ప్రచురితం అయిన అధ్యయనం తెలిపింది. వృద్ధాప్యానికి సంబంధించి తిరిగి సరిచేయగల అన్ని కణాలను శరీరం నుంచి తొలగించినా 156 ఏండ్లకు మించి బతకడం కష్టం అని శాస్త్రవేత్తలు తెలిపారు. మానవ శరీరంలో పేరుకుపోయే తిరిగి సరిచేయలేని కణాల ఆధారంగా శాస్త్రవేత్తలు గరిష్ఠ ఆయుష్షును నిర్ధారించడం ఇదే మొదటిసారి. ప్రస్తుత కాలంలో యాంటీ ఏజింగ్ చికిత్సలు ఎన్నో వస్తున్నా.. అవి ఒక పరిమితిని దాటి పనిచేయట్లేదని ఈ అధ్యయనం వెల్లడించింది. గుండె, మెదడు కణాలు ప్రధానంగా మానవుడి జీవిత కాలాన్ని తగ్గిస్తున్నట్టు ఇందులో శాస్త్రవేత్తలు తెలిపారు. వృద్ధాప్యానికి కారణమయ్యే అన్ని రకాల ప్రక్రియలను శాస్త్రవేత్తలు తొలగించినా.. మనిషి గరిష్ఠంగా 146 నుంచి 194 ఏండ్ల మధ్యే బతకగలడని ఈ అధ్యయనం వెల్లడించింది.
ఈ అధ్యయన సహ రచయిత ఎవ్గెనీ ఎఫిమోప్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమాటిక్ మ్యుటేషన్లను శరీరంలో నుంచి పూర్తిగా తొలగించే శస్త్రచికిత్సలు ఇప్పటికీ అందుబాటులో లేవు. కాలేయం వేల ఏండ్ల పాటు కొత్త కణాలను ఉత్పత్తి చేస్తూ మ్యుటేషన్లను తట్టుకుంటోంది. కానీ కొత్త కణాలను ఉత్పత్తి చేయలేని గుండె, మెదడు అవయవాలపై ఈ సోమాటిక్ మ్యుటేషన్లు పేరుకుపోయి.. వృద్ధాప్య మరణానికి కారణం అవుతాయి. అధ్యయనం మొదట్లో వృద్ధాప్యం మరణానికి కారణం కాదు అని భావించి మనిషి సగటు ఆయుష్షును ఎక్కువగా అంచనా వేశారు. కానీ ఎప్పుడైతే సోమాటిక్ మ్యుటేషన్లను పరిగణలోకి తీసుకున్నారో మనిషి గరిష్ఠ ఆయుష్షు 156 ఏండ్లకు పడిపోయింది. రాబోయే రోజుల్లో మరిన్ని వృద్ధాప్య కారణాలను ఇందులో జోడిస్తే.. అప్పుడు ఆయుష్షు మరింత తగ్గే ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.