న్యూఢిల్లీ: 20 ఏళ్ల యువతిపై సోమవారం ఢిల్లీలో యాసిడ్ దాడి(Acid Attack) జరిగిన ఘటన తెలిసిందే. అయితే ఆ స్టోరీలో ఓ ట్విస్ట్ చోటుచేసుకున్నది. అది యాసిడ్ దాడి కాదని తెలిసింది. టాయిలెట్ క్లీనర్ వల్ల ఆ అమ్మాయి చేతులు కాలినట్లు తేలింది. ఈ ఘటనకు చెందిన విషయాన్ని పోలీసులు వెల్లడించారు. తనను వెంబడిస్తున్న వ్యక్తులే యాసిడ్ దాడి చేసినట్లు ఆ అమ్మాయి తొలుత ఆరోపించింది. ఎక్స్ట్రా క్లాసుకు వెళ్తున్న సమయంలో దాడి జరిగినట్లు ఆ అమ్మాయి తండ్రి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ అటాక్ కేసును సీరియస్గా తీసుకుని విచారణ చేపట్టారు. కానీ 24 గంటల్లోనే ఆ స్టోరీ వెనుక దాగిన నిజం బయటపడింది.
అమ్మాయి తండ్రి అఖీల్ ఖాన్ను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు వ్యక్తులను పట్టించేందుకు బాధితురాలి తండ్రి యాసిడ్ దాడి కథ అల్లినట్లు తేల్చారు. తండ్రి ఆదేశాల మేరకు ఆ అమ్మాయి అబద్దాలు చెప్పిందన్నారు. తన కూతురి చేతులు కాలడానికి యాసిడ్ కారణం కాదు అని, టాయిలెట్ క్లీనర్ వల్ల అలా జరిగినట్లు ఖాన్ నేరాన్ని అంగీకరించాడు. ఇంట్లో ఉన్న టాయిలెట్ క్లీనర్ ను చేతులపై పోసుకున్నట్లు చెప్పాడు. తండ్రితో పాటు కూతురిపై కేసు బుక్ చేయనున్నట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు.
ఢిల్లీ యూనివర్సిటీలో బీకామ్ చదువుతున్న అమ్మాయిపై సోమవారం అటాక్ జరిగింది. జితేంద్ర అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి దాడికి పాల్పడినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్నాళ్ల నుంచి జితేంద్ర ఫాలో అవుతున్నాడని, రెండు నెలల క్రితం ఇద్దరి మధ్య గొడవై అయినట్లు చెప్పింది. అయితే దర్యాప్తు సమయంలో పోలీసులకు అమ్మాయిపై అనుమానం వచ్చింది. యాసిడ్ దాడి జరిగినట్లు చెబుతున్న సమయంలో.. జితేంద్ర కరోల్ బాగ్లో ఉన్నట్తు పోలీసులు తేల్చారు. అతని మొబైల్ లొకేషన్, సీసీటీవీ ఫూటేజ్, ప్రత్యక్ష సాక్షులు కూడా దీన్ని కన్ఫర్మ్ చేశాయి. అమ్మాయి చెప్పిన బైక్ కూడా కరోల్ బాగ్లో ఉన్నట్లు గుర్తించారు. దాడి జరిగిన ప్రదేశంలో యాసిడ్ మరకలు కనిపించలేదు.
ఈ ఘటనకు రెండు రోజుల ముందు జితేంద్ర భార్య .. పోలీసులకు ఫోన్ చేసి, అఖీల్ ఖాన్ వేధింపులకు, బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు చేసింది. గతంలో ఖాన్ ఫ్యాక్టరీలో పనిచేశానని జితేంద్ర భార్య చెప్పింది. అయితే జితేంద్ర భార్య మీద కోపంతో అఖీల్ యాసిడ్ దాడి కథ అల్లినట్లు పోలీసులు తేల్చారు.