లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే పగుళ్లించింది. పదిహేను మీటర్ల పొడవు, రెండు అడుగుల వెడల్పు మేర పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో స్థానికులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. స్పందించిన అధికారులు వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టారు.
అయితే నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వేపై తవ్వకం పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. సెక్టార్ 96 వద్ద అండర్ పాస్ కోసం పనులు జరుగుతున్నాయని చెప్పారు. శుక్రవారం పనులు మొదలయ్యాయని, దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని వివరించారు.
కాగా, 27 కిలోమీటర్ల పొడవైన నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వే మీదుగా లక్షల్లో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. సెలవు రోజులైన శనివారం, ఆదివారం ఈ మార్గంలో ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. మరోవైపు అండర్ పాస్ పనుల వల్ల ఆ ఎక్స్‌ప్రెస్ వేపై ట్రాఫిక్ జామ్‌లు, అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. అయితే శనివారం పరిస్థితి మెరుగుపడిందని, ట్రాఫిక్ జామ్ తగ్గిందని వెల్లడించారు.