న్యూఢిల్లీ : ఎంబీబీఎస్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్లలో భారీ కుంభకోణం గుట్టును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రట్టు చేసింది. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్ఆర్ఐ) కోటా సీట్లలో ఈ అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాల్లోని ఇండియన్ మిషన్స్ సహకారంతో ఈ దర్యాప్తును నిర్వహించింది. ప్రైవేట్ వైద్య కళాశాలలు నకిలీ ధ్రువపత్రాలు, ఫోర్జరీ చేసిన ఎన్ఆర్ఐ సర్టిఫికెట్లను ఉపయోగించి, సుమారు 18,000 అండర్గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ సీట్లను భర్తీ చేసినట్లు ఈ దర్యాప్తులో వెల్లడైంది. ఈ కుంభకోణంలో కొందరు ఎన్ఆర్ఐల పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించింది.
ఈడీ పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో నిర్వహించిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న ఎన్ఆర్ఐ ధ్రువపత్రాలను ఇండియన్ ఎంబసీలకు పంపించింది. వీటిలో అత్యధిక ధ్రువపత్రాలు నకిలీవి, ఫోర్జరీ చేసినవి అని నిర్ధారణ అయింది. కుటుంబ వంశవృక్షాలను కూడా నకిలీవి సృష్టించారని, స్టూడెంట్-ఎన్ఆర్ఐ రిలేషన్‌షిప్‌ను కూడా తప్పుగా చూపించారని తెలిసింది.
ఒకే ఎన్ఆర్ఐకి సంబంధించిన పత్రాలను సంబంధం లేని అనేక మంది అభ్యర్థుల కోసం ఉపయోగించినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రతి ఎన్ఆర్ఐ సర్టిఫికెట్‌ను ఇండియన్ మిషన్స్, ఎంబసీలు తనిఖీ చేయాలని, అవి సరైనవని నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే అడ్మిషన్స్‌కు చెల్లుబాటవుతాయని చెప్పింది.