న్యూఢిల్లీ, అక్టోబర్ 15: ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం భయాలు అలముకొంటున్న వేళ.. మన దేశంలో తిండి గింజలకు కటకట ఏర్పడే ప్రమాదం కనిపిస్తున్నది. దేశంలో ప్రజల ప్రధాన ఆహారమై గోధుమ, బియ్యం నిల్వలు ఐదేండ్ల కనిష్టానికి పడిపోయాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకి సామాన్యుడిని ఎక్కిరిస్తున్నాయి. ఈ వానకాలం సీజన్లో దేశంలో వరి సాగు విస్తీర్ణం ఏకంగా ఆరేడు శాతం తగ్గిపోయింది. ఇప్పుడు పాత నిల్వలు కూడా పడిపోవటంతో కోట్ల మంది ప్రజలు అన్నమో రామచంద్రా అని అలమటించే పరిస్థితులు రాబోతున్నాయని వ్యవసాయార్థికవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఖాళీ అయిన గోదాములు
140 కోట్లకు పైగా ఉన్న భారతీయుల ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) ద్వారా ఆహార ధాన్యాలను సేకరించి నిల్వచేయటం దశాబ్దాలుగా వస్తున్నది. ఇటీవలి కాలంలో వ్యవసాయంలో సంస్కరణల పేరిట రైతుల జీవితాలను నడిరోడ్డుపై నిలబెట్టిన నరేంద్రమోదీ ప్రభుత్వం, ప్రజల ఆహార భద్రతతో కూడా ఆడుకొంటున్నది.
అక్టోబర్ 1 నాటికి దేశవ్యాప్తంగా ఎఫ్సీఐ గోదాముల్లో బియ్యం, గోధుమ నిల్వలు 511.41 లక్షల టన్నులకు పడిపోయాయని ఎఫ్సీఐ గురువారం స్వయంగా వెల్లడించింది. 2017 అక్టోబర్ 1 తర్వాత ఇవే అతి తక్కువ నిల్వలు. 2021 అక్టోబర్ 1న ఎఫ్సీఐ వద్ద 816 లక్షల టన్నుల నిల్వలు ఉండేవి. ఏడాదిలోనే ఏకంగా 305 లక్షల టన్నులు తగ్గిపోయాయి. ఈ నెల 1వ తేదీ నాటికి గోధుమ నిల్వలు 227.5 లక్షల టన్నులు ఉన్నాయి. ఇది ఆరేండ్ల కనిష్టం. అంతేకాదు ఇది వ్యూహాత్మక నిల్వల స్థాయికి పడిపోయింది.
దేశప్రజలకు మూడు నెలలకు సరిపడా నిల్వలతోపాటు కొత్త పంట సేకరణ ఆలస్యమైతే సర్దుబాటు చేసేందుకు అవసరమైనన్ని నిల్వలను కలిపి వ్యూహాత్మక నిల్వ స్థాయిగా కేంద్రం గతంలో నిర్ణయించింది. దీని ప్రకారం ఎఫ్సీఐ గోదాముల్లో ఏడాదిలో ఏ ఒక్కరోజు కూడా గోధుమలు 205.2 లక్షల టన్నలకంటే తగ్గకూడదు. గోధుమలతో పోల్చితే బియ్యం నిల్వలు కాస్త బాగానే ఉన్నప్పటికీ.. అవి కూడా నాలుగేండ్ల కనిష్టానికి పడిపోయాయి. ప్రస్తుతం ఎఫ్సీఐ వద్ద వ్యూహాత్మక నిల్వలకంటే 2.8 రెట్ల నిల్వలు ఉన్నాయి. అయితే, ఇందులో కొంతవరకు ఇంకా ధాన్యం రూపంలోనే ఉన్నాయి. మరాడించి బియ్యం ఉత్పత్తి చేయాల్సి ఉన్నది.
సేకరించని కేంద్రం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆహార ధాన్యాల సేకరణ నుంచి తప్పుకొనేందుకు కొంతకాలంగా వ్యూహాలు అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా రైతులు తమ పంట ఉత్పత్తులను బహిరంగ మార్కెట్లో అమ్ముకోవాలని ప్రోత్సహిస్తున్నది. పరోక్షంగా అలాంటి పరిస్థితులనే కల్పిస్తున్నది. మూడు నెలల క్రితమే కేంద్ర ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్.. దేశంలో నాలుగేండ్లకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని గొప్పగా ప్రకటించారు. ఎఫ్సీఐ వద్ద నిల్వలు పుష్కలంగా ఉన్నందున దేశంలో రైతులు పండించిన పంట మొత్తాన్ని కొనలేమని తేల్చేశారు.
ఆ తర్వాత నెలకే బియ్యం ఎగుమతులపై నిషేధం విధించి దేశంలో బియ్యం నిల్వలు తగ్గిపోయాయని పరోక్షంగా ఒప్పుకొన్నారు. ఇప్పుడు నిల్వలు ఏకంగా కనీస స్థాయికి పడిపోయాయి. దీంతో మోదీ సర్కారుకు ప్రజల ఆహార భద్రతపై ఏమాత్రం అవగాహన, ముందుచూపు లేదని తేలిపోయిందని నిపుణులు మండిపడుతున్నారు. వానకాలం పంట గోధాముల్లోకి రావటానికి ఇంకా మూడు నెలలు పడుతుంది.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉండటంతో సరఫరా వ్యవస్థ మరింత అస్తవ్యస్తం అయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. ఇవన్నీ ప్రపంచాన్ని ఆర్థికమాంద్యం అంచున నిలబెట్టాయని ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు శుక్రవారమే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భారత ప్రజల ఆహార భద్రత ఇప్పుడు గాలిలో దీపంలా మారిందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం
గోదాముల్లో నిల్వలు తగ్గిపోతుండటంతో మార్కెట్లో వాటి ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరిగిపోతున్నది. సాధారణంగా ఆహార ధాన్యాల నిల్వలు తగ్గితే వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) పెరుగుతుంది. అంటే ధరలు పెరుగుతాయని అర్థం. ఇది ఏటా 11.53 శాతం పెరుగుతున్నది. ఇది 2012లో నమోదైన పెరుగుదల కంటే ఎక్కువ. సీపీఐని లెక్కగట్టేందుకు కేంద్రం 2010 సంవత్సరాన్ని ఆధార సంవత్సరం (బేస్ ఇయర్)గా నిర్ణయించింది. గత నెలలో సీపీఐ ఏకంగా 17.41 శాతం నమోదైంది. మనదేశంలో దాదాపు 80 కోట్ల మందికి గోధుమ ప్రధాన ఆహారం. ఇప్పుడు గోధుమ నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోవటంతో మార్కెట్లో గోధుమలు, గోధుమ పిండితోపాటు వాటితో చేసే వంటకాల ధరలు మండిపోయే ప్రమాదం ఉన్నదని నిపుణులు చెప్తున్నారు.
అశాస్త్రీయమైన నివేదిక
ఆకలి సూచీ నివేదిక అశాస్త్రీయమైనది. గాల్లప్ అనే ఏజెన్సీ సాయంతో టెలిఫోన్లో ప్రజలను ఏవో నాలుగు ప్రశ్నలు వేసి ఒపీనియన్ పోల్ నిర్వహిస్తారు. వాళ్లు చెప్పిన వాటిని బట్టి నచ్చినట్టు నివేదికను తయారు చేస్తారు. ఈ నివేదిక ఓ తప్పుల తడక. దీన్ని విశ్వసించాల్సిన అవసరం ఏమాత్రం లేదు.
-కిందటేడాది అక్టోబర్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
మీరిచ్చిన డాటా ఆధారంగానే..
భారత్లోని మోదీ సర్కారు మా నివేదిక అశాస్త్రీయంగా ఉన్నదంటూ కిందటేడాది అభ్యంతరం వ్యక్తం చేసింది. గాల్లప్ ఒపీనియన్ పోల్ సేకరించి ఈ నివేదికను తయారు చేసిందంటూ ఆరోపించింది. అయితే, ఐక్యరాజ్యసమితికి భారత ప్రభుత్వం ఇచ్చే వివరాలను ఆధారంగా చేసుకొనే మేము ఈ నివేదికను వెలువరిస్తాం. ఇది శాస్త్రీయమైనది. అది గమనించాలి.
– గ్లోబల్ హంగర్ ఇండెక్స్ సూచీ సలహాదారు మిరియమ్ వేయిమర్స్