Bank : బ్యాంకు ముందు జనం బారులు తీరారు. 2016లో నోట్ల రద్దు సందర్భంగా పాత నోట్లను మార్చుకోవడానికి దేశవ్యాప్తంగా బ్యాంకుల ముందు కస్టమర్లు బారులు తీరిన దృశ్యాలను తలపించేలా ఆ బ్యాంకు ముందు జనాలు క్యూకట్టారు. అది గుజరాత్ (Gujarat) లోని మెహసానా (Mehsana) లో గల అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ (Urban Cooperative Bank). ఇంతకూ ఆ బ్యాంకు దగ్గర జనం ఎందుకు బారులు తీరారో తెలుసా..? చిల్లర డబ్బుల కోసం. అవును చిల్లర కోసమే. వింతగా ఉందా అయితే వివరాల్లోకి వెళ్దాం..
ఆర్బీఐ ఆదేశాల మేరకు గుజరాత్ రాష్ట్రం మెహసానాలోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఒక ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసింది. స్థానికంగా నెలకొన్న చిల్లర కొరతను తీర్చాలన్నది ఆ శిబిరం ఉద్దేశం. ఆ శిబిరంలో బ్యాంకు సిబ్బంది కొత్తగా ముద్రించిన రూ.10 నోట్లు, నాణేలను మార్పిడి చేసింది. పెద్ద కరెన్సీ ఇచ్చి రూ.10, రూ.20 నోట్లు కాయిన్లతోపాటు, రూ.5, రూ.2, రూ.1 కాయిన్లు తీసుకోవడం కోసం జనం భారీగా తరలివచ్చారు.
దాంతో బ్యాంకు ముందు భారీ క్యూలైన్ ఏర్పడింది. ఈ ఒక్కరోజు శిబిరంలో బ్యాంకు సిబ్బంది రూ.14 లక్షల విలువైన రూ.10, 20 నోట్లు.. రూ.3 లక్షల విలువైన రూ.1, 2, 5 నాణేలను బ్యాంక్ అధికారులు మార్పిడి చేశారు. ఉదయం పది గంటల మొదలైన ఈ డ్రైవ్.. సాయంత్రం వరకు కొనసాగింది. రోజూవారీ ఖర్చులకు, వ్యాపార ఖర్చులకు చిల్లర లేదని చిరు వ్యాపారులు, స్థానికులు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లు ఇచ్చి చిల్లర తీసుకున్నారు.