గురుగ్రామ్: బీజేపీ పాలిత రాష్ర్టాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లోని డొల్లతనం, భారీ అవినీతి ఇటీవల కురిసిన వర్షాలతో బయటపడుతున్నది. బీజేపీ పాలిత హర్యానాలోని గురుగ్రామ్‌లో బుధవారం కురిసిన భారీ వర్షానికి ఏకంగా రోడ్డులో కొంత భాగం కూలిపోయి పెద్ద బిలంలా ఏర్పడింది. రాత్రి 10.30 గంటలకు వర్షంలో సదరన్ పెరీఫెరల్ రోడ్‌పై ఒక ట్రక్ వెళ్తుండగా, హఠాత్తుగా రోడ్డు కొట్టుకుపోయి భారీ గొయ్యి పడటంతో అందులోకి ట్రక్ బోల్తా పడింది. అయితే ట్రక్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
కాగా, ఇటీవలే ఈ రోడ్లో మురికి కాలువ నిర్వహణ పనులను అధికారులు నిర్వహించారు. కాగా, భారీ వర్షానికి గురుగ్రామ్‌లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్ వేలోని నర్సింగ్‌పూర్ ప్రాంతం ఈ భారీ వానకు తీవ్రంగా ప్రభావితమైంది. ఈ ప్రాంతంలో రహదారితో పాటు అండర్‌పాస్‌లు నీటితో నిండిపోయాయి.