చండీఘడ్: హర్యానాలో వెహికిల్ రిజిస్ట్రేషన్ శాఖలో HR 88B 8888 నెంబర్ ప్లేట్ కోసం ఓ వ్యక్తి 1.17 కోట్లు పెట్టి దక్కించుకున్న విషయం తెలిసిందే. దేశంలోనే అత్యంత ఖరీదైన లైసెన్స్ ప్లేట్‌గా గుర్తింపు పొందింది. రాష్ట్రానికి చెందిన వీఐపీ రిజిస్ట్రేషన్ స్కీమ్ కింద ఆన్లైన్లో జరిగిన వేలంలో ఓ వ్యక్తి ఆ నెంబర్ ప్లేట్‌ను దక్కించుకున్నాడు.
హిస్సార్‌కు చెందిన సుధీర్ కుమార్ అనే వ్యక్తి ఆ నెంబర్ ప్లేట్‌ను కైవసం చేసుకున్నాడు. అయితే పేమెంట్ పూర్తిగా ముగిసిన తర్వాత మాత్రమే వాహనం రిజిస్ట్రేషన్ జరుగుతుందని అధికారులు చెప్పారు. వీఐపీ HR 88B 8888 నెంబర్ ప్లేట్ దక్కించుకున్న సుధీర్‌కు వాహనం లేదని తెలిసింది. కేవలం ఆ నెంబర్‌ను ఇష్టపడడం వల్లే దాన్ని ఈవేలంలో దక్కించుకున్నట్లు ప్రాథమికంగా వెల్లడైంది.
శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు నిర్వహించిన వేలంలో ఈ నంబర్ ప్లేట్‌కు 45 బిడ్స్ వచ్చాయి. ఈ ప్లేట్లోని ఇంగ్లిష్ అక్షరం బీ, అంకె 8 ఒకే విధంగా ఉండటం వల్ల ఎక్కువ మందిని ఆకర్షించింది. బేస్ ప్రైస్ రూ.50,000 నుంచి ప్రారంభమైంది. బుధవారం మధ్యాహ్నానికి రూ.88 లక్షలకు చేరింది. చివరికి వేలం ముగిసే సమయానికి రూ.1.17 కోట్లకు చేరింది.
HR 88B 8888 నెంబర్ ప్లేట్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 8వ నెంబర్ అంకె మళ్లీ మళ్లీ రిపీట్ అవ్వడాన్ని కొన్ని సంస్కృతుల్లో మంగళకరంగా భావిస్తారు. అయితే ఆ అంకెకు సరైన రీతిలో B అక్షరం కలిసిపోవడం వల్ల ఆ సంఖ్య సీక్వెన్స్ పెరిగినట్లుగా ఉంటుందని, దీన్ని కొందరు కారు ఓనర్లు ఇష్టపడుతుంటారు. అందుకే HR 88B 8888 నెంబర్‌ను లక్కీగా భావిస్తున్నారు.