Heart Diseases | న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఇటీవలి కాలంలో అందరూ టీవీలు, స్మార్ట్ఫోన్ల స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. గంటలకొద్దీ స్క్రీన్లపై గడిపితే ముఖ్యంగా పిల్లల్లో గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని డెన్మార్క్‌లోని కోపెన్‌హెగెన్ వర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ‘జర్నల్ ఆఫ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ కథనం ప్రకారం, కార్డియోమెటబాలిక్ వ్యాధులకు దారితీసే అంశాలకు, స్క్రీన్ టైమ్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించేందుకు వెయ్యిమంది పిల్లలపై సైంటిస్టులు అధ్యయనం చేపట్టారు.
10 ఏండ్లు, 18 ఏండ్ల పిల్లల స్క్రీన్ టైమ్, నిద్ర తీరులను పరిశీలించారు. ‘ఎలక్ట్రానిక్ పరికరాలతో అధిక సమయం గడుపుతున్న పిల్లలు, టీనేజర్లలో కార్డియోమెటబాలిక్ వ్యాధులు వస్తున్నాయి. అధిక బీపీ, అధిక కొవ్వు, ఇన్సులిన్ నిరోధకత వంటివి తలెత్తే అవకాశముంది’ అని నివేదిక పేర్కొన్నది. రోజువారీ స్క్రీన్ సమయం ప్రతి అదనపు గంట వ్యాధి ప్రమాదాన్ని పెంచుతున్నదని నివేదిక తెలిపింది.