నోయిడా, ఆగస్టు 10: ఇటీవల బీజేపీ పాలిత యూపీలో ఒక వ్యక్తి ఏకంగా నకిలీ రాయబారి కార్యాలయాన్ని పెట్టి ప్రజల్ని మోసం చేసిన ఘటన మరువక ముందే అదే రాష్ట్రంలోని నోయిడాలో ఒక నకిలీ పోలీస్ స్టేషన్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నోయిడా ఫేజ్ 3లో ఇంటర్నేషనల్ పోలీస్ అండ్ క్రైమ్ ఇన్విస్టిగేషన్ పేరుతో కొందరు నకిలీ పోలీస్‌స్టేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాము ప్రభుత్వ అధికారులమని చెప్పి వీరు నకిలీ పత్రాలు, నకిలీ ఐడీలు, పోలీస్ తరహా చిహ్నాలతో పలువురిని మోసగించే వారు.
వీరు ఒక వెబ్‌సైట్‌ను కూడా తెరచి భారీగా విరాళాలు సేకరించే వారు. తమది చట్టబద్ధమైన సంస్థ అని రుజువు చేసేందుకు వీరు జాతీయ, అంతర్జాతీయ నకిలీ డాక్యుమెంట్లు చూపేవారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు దీనిపై దాడి చేసిన పోలీసులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేశారు.
వీరు పలువురు ప్రముఖులకు ఫోన్లు చేసి వెరిఫికేషన్, విచారణ పేరిట వారిని బెదిరించి డబ్బులు గుంజేవారని డీసీపీ శక్తి మోహన్ అవస్థి తెలిపారు. వీరి వద్ద నుంచి పెద్ద యెత్తున నకిలీ ప్రభుత్వ చిహ్నాలు, స్టాంపులు, లెటర్‌హెడ్స్, వివిధ ప్రభుత్వ ముద్రలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.