India-Bangladesh ties : బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాకు సంబంధించి మొదలైన గొడవ హింసాత్మకంగా మారి చివరికి ప్రధాని షేక్ హసీనాను పదవీచ్యుతురాలిని చేసింది. ఆందోళనకారులు సోమవారం ప్రధాని కార్యాలయం అయిన ఢాకా ప్యాలెస్‌ను చుట్టుముట్టడంతో.. ఆమె పదవికి రాజీనామా చేసి ఆర్మీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో భారత్‌కు వచ్చారు. ప్రస్తుతం ఆమె మన దేశంలో ఆశ్రయం పొందుతున్నది.
షేక్ హసీనా పదవీచ్యుతురాలు అయిన నేపథ్యంలో ఆమెకు భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలపై ఏ మేరకు ప్రభావం పడుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి 2009లో షేక్ హసీనా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్‌కు సహకరిస్తూ వచ్చారు. బంగ్లాదేశ్‌లో ఉన్న భారత వ్యతిరేక ఉగ్రవాద ముఠాలన్నింటినీ తుద ముట్టించారు. అంతేగాక భారత్-బంగ్లాదేశ్ మధ్య ఆర్థికంగా సామాజికంగా, సాంస్కృతికంగా బలమైన బంధం ఏర్పాటుకు కృషి చేశారు.
భారత ఉపఖండంలో భారతదేశానికి బంగ్లాదేశ్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్నది. అదేవిధంగా ఆసియా ఖండంలో బంగ్లాదేశ్‌కు చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. పైగా భారతదేశం నుంచి అత్యధికంగా కాటన్‌ను దిగుమతి చేసుకుంటున్నది కూడా బంగ్లాదేశే. భారత కాటన్ ఎగుమతుల్లో ఏకంగా 34.9 శాతాన్ని బంగ్లాదేశ్ దిగుమతి చేసుకుంటున్నది.
అంతేగాక పెట్రోలియం ఉత్పత్తులు, తృణధాన్యాలు కూడా భారత్ నుంచి బంగ్లాదేశ్ చేసుకుంటున్న ప్రధాన దిగుమతులుగా ఉన్నాయి. ఈ క్రమంలో షేక్ హసీనా పదవీచ్యుతురాలు కావడం భారత్‌కు నష్టమనే చెప్పవచ్చని నిపుణులు చెబుతున్నారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ప్రస్తుతం ఉన్నంత బలంగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.