Divorce | పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు చెబుతుంటారు. కానీ నేటి సమాజంలో పెళ్లంటే మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. జీవితాంతం కలిసి ఉండాలనే ఓపిక చాలామంది భార్యాభర్తల్లో సన్నగిల్లుతోంది. అభిరుచులు కలవడం లేదని.. అభిప్రాయాలు కుదరడం లేదని చిన్న చిన్న కారణాలకే మనస్పర్థలు పెంచుకుంటున్నారు. గొడవలు పడుతున్నారు. గిల్లికజ్జాలు ముదిరి మాటామాటా పెరగడంతో విడాకుల వరకూ వెళ్లిపోతున్నారు. అందుకే విడాకులు తీసుకునే జంటలు రోజురోజుకీ ఎక్కువైపోతున్నాయి. వైవాహిక బంధం బలహీనపడుతున్న ఇలాంటి తరుణంలో విడాకులు తీసుకోవడం అంత ఈజీనా? పెండ్లయిన ఎన్ని రోజులకు విడాకులు తీసుకోవచ్చు? వంటి వివరాలు ఒకసారి తెలుసుకుందాం..
భార్యాభర్తల మధ్య ప్రేమ, ఆప్యాయత లేనప్పుడు.. ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం లేనప్పుడు విడాకులు తీసుకోవచ్చని హిందూ వివాహ చట్టం 1955 చెబుతోంది. ఈ చట్టంలోని సెక్షన్ 10, 15లు వీటి గురించి ప్రస్తావించాయి. సెక్షన్ 13లో విడాకుల గురించి తెలియజేయగా.. సెక్షన్ 10లో న్యాయపరంగా విడిపోవడానికి సంబంధించిన నియమాలనున పేర్కొన్నారు. వీటి ప్రకారం అభిప్రాయాలు, అభిరుచులు కలవనప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించి పరస్పర అంగీకారంతో భార్యాభర్తలు విడిపోవచ్చు. సాధారణంగా విడాకులు కావాలంటే భార్యాభర్తలు పెండ్లయిన తర్వాత కనీసం ఏడాదిపాటు ఆగాల్సి ఉంటుందని చాలామంది అంటుంటారు. కానీ కొత్త జంట మధ్య సయోధ్య కుదరకపోతే వివాహం జరిగిన వారం రోజులకే విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించవచ్చు. అయితే దరఖాస్తు చేసుకున్న వెంటనే న్యాయస్థానం విడాకులు మంజూరు చేయదు. దరఖాస్తు చేసుకున్న తర్వాత భార్యాభర్తలు కలిసి ఉండేందుకు ఒక అవకాశం ఇస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ఆరు నెలలు సమయం ఇస్తుంది. ఆ గడువులోపు దంపతులు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటే సరి.. లేదంటే వాళ్లు కోరినట్లుగా విడాకులను మంజూరు చేస్తుంది.
విడాకులు తీసుకునేందుకే కాదు.. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉండాలని చెప్పేందుకు కూడా చట్టాలు ఉన్నాయి. దంపతులు ఇద్దరిలో ఏ ఒకరికి విడిపోవడం ఇష్టం లేకపోయినా తమ భార్య లేదా భర్తను కాపురానికి రావాల్సిందిగా కోర్టును ఆశ్రయించవచ్చు. ఈ విషయాన్ని హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 9, స్పెషల్ మ్యారేజి యాక్ట్ 1954లోని సెక్షన్ 22 చెబుతున్నాయి. ఈ చట్టాల ప్రకారం భార్యాభర్తల్లో ఎవరైనా సరే తనతో కాపురం చేయాలంటూ జిల్లా కోర్టును మరొకరు ఫిర్యాదు చేయవచ్చు. తనతో కలిసి జీవించడంతో పాటు శారీరక సంబంధం కొనసాగించేలా న్యాయస్థానం నుంచి ఆదేశాలు కూడా పొందవచ్చు. అయితే అలా దరఖాస్తు చేసుకున్న సమయంలో తాము విడిపోవడానికి చట్టపరంగా సరైన కారణం ఏదీ లేదని సదరు వ్యక్తి నిరూపించాల్సి ఉంటుంది.
Pawan Kalyan | మూడో భార్యతో పవన్ విడాకులు.. ఇందులో నిజమెంత?