లక్నో: సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లో భారీ చీలక వస్తుందన్న ఉత్తరప్రదేశ్ మంత్రి ఓం ప్రకాష్ రాజ్భర్ వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఈ వ్యవహారం ఇంకెంత కాలం కొనసాగుతుంది? అని ప్రశ్నించారు. (Akhilesh Yadav) బీజేపీ గతంలో అనేక పార్టీలలో చీలికలు తెచ్చిందని ఆయన విమర్శించారు. ఉత్తరప్రదేశ్లో ఎస్పీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ‘మీకు అన్నం పెట్టేవారి భాషనే మీరు మాట్లాడతారు’ అని రాజ్భర్పై మండిపడ్డారు.
కాగా, ఎస్పీ ప్రతినిధి మనీష్ సింగ్ కూడా మంత్రి ఓం ప్రకాష్ రాజ్భర్ వ్యాఖ్యలపై స్పందించారు. తమ పార్టీపై వ్యాఖ్యానించే ముందు తన సొంత సామర్థ్యాలను ఆయన అంచనా వేసుకోవాలని సూచించారు. ‘సమాజ్వాదీ పార్టీ గురించి మాట్లాడే ముందు, ఓం ప్రకాష్ రాజ్భర్ ముందుగా తన సొంత రాజకీయ బలాన్ని, సామర్థ్యాలను బేరీజు వేసుకోవాలి. మీ పార్టీలోని మొత్తం కార్యకర్తలు, నాయకుల సంఖ్య.. మా పార్టీలోని ఒకే ఒక్క బ్లాక్లో ఉన్న కార్యకర్తలు, నాయకుల సంఖ్యతో సమానం కూడా కాదు’ అని అన్నారు.