Twitter | న్యూయార్క్: రోజుకు 600 ట్వీట్లను మాత్రమే చూడాలంటూ ట్విట్టర్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేలమంది యూజర్లు దీనిపై ఫిర్యాదులు చేస్తున్నారు. సాధారణ యూజర్లు రోజుకు 600 ట్వీట్లు, బ్లూ టిక్ ఉన్న యూజర్లు రోజుకు 6 వేల ట్వీట్లు మాత్రమే చూసేలా ట్విట్టర్ మార్పులు తీసుకొచ్చింది. దీనిపై ట్విట్టర్ యూజర్లు మండిపడుతున్నారు. ఆన్లైన్ అంతరాయాలను ట్రాక్ చేసే వెబ్సైట్ డౌన్ డెటెక్టర్ ప్రకారం సుమారు 7,500 మంది యూజర్లు దీనిపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తున్నది.
ట్విట్టర్ డౌన్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉన్నది. ట్విట్టర్ యాజమాన్యం తీసుకున్న తాజా నిర్ణయంపై ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే స్పందించారు. ఇలాంటి నిర్ణయాలతో ట్విట్టర్‌ను నడపడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. పరిమితమైన వనరులతోనే ట్విట్టర్ టీమ్ నెట్టుకొస్తున్నదని తాను భావిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. గతేడాది ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక, ట్విట్టర్లో వివాదాలు సర్వ సాధారణంగా మారాయి. ఆదాయాన్ని పెంచడంలో భాగంగా బ్లూ టిక్ కోసం రుసుం చెల్లించాలని గతంలో మస్క్ తీసుకున్న నిర్ణయం కూడా వివాదాస్పదమైంది.