పాట్నా, అక్టోబర్ 9: తమ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి కనుక బీహార్లో అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలోని కనీసం ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, ఈ మేరకు కొత్త చట్టాన్ని తెస్తామని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ గురువారం ప్రకటించారు. పాట్నాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘నేను చేసే మొదటి ప్రకటన ఏమిటంటే బీహార్లో ప్రభుత్వ ఉద్యోగం లేని ప్రతి కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాం.
ఈ మేరకు కొత్త చట్టాన్ని తెస్తాం. ఈ చట్టం కూడా మేము అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లో తెస్తాం. అంతేకాకుండా 20 నెలల్లోపు ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తాం’ అని ప్రకటించారు. బీహార్ ఉప ముఖ్యమంత్రిగా చేసినప్పుడు వేలాది మందికి ఉపాధి కల్పించానని, మరింత మందికి ఉపాధి కల్పించడానికి రంగం సిద్ధం చేశానని తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ఎన్డీఏ నిరుద్యోగ సమస్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. తాము గతంలో చేసిన పలు వాగ్దానాలను నితీశ్ కుమార్ ప్రభుత్వం కాపీ కొట్టిందని ఆయన విమర్శించారు.