బెంగళూరు, మార్చి 20: కేంద్ర మంత్రులతో సహా దాదాపు 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్లో చిక్కుకున్నట్టు కర్ణాటక సహకార శాఖ మంత్రి రాజన్న గురువారం రాష్ట్ర అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్య ఏ ఒక్క రాజకీయ పార్టీకో పరిమితం కాదని, దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
హనీ ట్రాపింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఆయన వివరిస్తూ వాట్సాప్లో వీడియో కాల్ లేదా మెసేజ్ వస్తుందని ఆయన చెప్పారు. గడచిన ఆరు నెలలుగా రాష్ట్రంలోని రాజకీయ నాయకులపై హనీ ట్రాప్ జరుగుతోందని ఆయన తెలిపారు. తుమకూరుకు చెందిన ఇద్దరు మంత్రులు హనీ ట్రాప్లో చిక్కుకున్నట్టు పత్రికలలో వార్తలు వచ్చాయని, తాను, హోం మంత్రి పరమేశ్వర మాత్రమే తుమకూరుకు చెందిన మంత్రులమని రాజన్న తెలిపారు.
హనీట్రాప్పై తాను హోం మంత్రికి లిఖితపూర్వక ఫిర్యాదు చేసి దర్యాప్తు కోరినట్టు తెలిపారు. మంత్రి రాజన్న కుమారుడు, ఎమ్మెల్సీ రాజేంద్ర శాసన మండలిలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మరో మంత్రి సతీశ్ జార్ఖిహోళి కూడాహనీ ట్రాప్ గురించి ప్రస్తావించారు.