Bihar floods : భారీ వర్షాల కారణంగా బిహార్‌ను వరదలు ముంచెత్తాయి. మొత్తం 11 జిల్లాలు వరద ప్రభావానికి గురికాగా.. 10.26 లక్షల మందిపై ప్రభావం పడింది. ఆయా ప్రాంతాల్లోని రోడ్లు, ఇండ్లు, మార్కెట్లు, వ్యవసాయ భూములు అత్యధిక శాతం నీట మునిగాయి. బెగుసరాయ్, వైశాలి ప్రాంతాలు మొత్తం నీట మునిగిపోగా.. అక్కడి ప్రజల్ని బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. గంగా నది ఉప్పొంగడం కూడా తాజా వరదలకు ప్రధాన కారణాల్లో ఒకటి.
పాట్నాలోని గాంధీ ఘాట్ వద్ద గంగా నది శనివారం ఉప్పొంగింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని స్తానికులు ఆందోళన చెందుతున్నారు. బిహార్ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అంచనా ప్రకారం.. రాష్ట్రంలోని 11 జిల్లాల్లోని 50 బ్లాకులు, 201 గ్రామ పంచాయతీలు తీవ్ర వరద ప్రభావానికి గురయ్యాయి. దీనివల్ల 10.26 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా పాట్నా, భోజ్‌పూర్, శరణ్, వైశాలి, భగల్పూర్, బెగుసరాయ్, బుక్సార్, సమస్తిపూర్, ముంగెర్, కతిహార్, అరేరియా ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది.
అనేక నదులు ఉప్పొంగుతూ, ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దుమ్రియా ఘాట్, హాజిపూర్ పరిధిలోని గండక్ నది, బల్తారాలోని కోసి నది, ఖగరియాలోని గండక్ నది, దిఘా, హతిదాహ్, భగల్పూర్, కహల్గాన్, బుక్సర్, ముంగెర్ ప్రాంతాల్లో గంగా నది ఉప్పొంగుతున్నాయి. పున్పున్ నది కూడా ప్రమాదకరంగానే ప్రవహిస్తోంది. ప్రస్తుతం గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద స్థాయికి మించి ప్రవహిస్తోంది. అలాగే, గంగా నదిలోకి నీటి ప్రవాహం కూడా ఎక్కువగానే ఉంది. దీంతో ఆదివారం ఉదయం నాటికి నీటి ఉధృతి మరింత పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.
మరోవైపు ఇండ్లు, రోడ్ల మీదకు నీళ్లు చేరడంతో జనజీవనం స్తంభించింది. అనేక ప్రాంతాల్లో ప్రజల్లు నీళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల రోడ్లపై రెండు, మూడు అడుగుల వరకు నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతో కొందరు ప్రజలు బోట్లలో ఇండ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. మరోవైపు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.