ముంబై, సెప్టెంబర్ 19 : రోడ్లపై గుంతల కారణంగా జరిగే ప్రమాదాలకు మున్సిపల్ కార్పొరేషన్లను బాధ్యుల్ని చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించగలదా అని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. రోడ్ల దుస్థితి కారణంగా సంభవించే మరణాలు లేదా అయ్యే గాయాలకు పురపాలక సంస్థలు, అధికారులను బాధ్యుల్ని చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. రోడ్లపై గుంతల వల్ల జరిగే ప్రమాదాల బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు ఓ విధానాన్ని రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమో కాదో తెలుసుకుని చెప్పాలని ప్రభుత్వ న్యాయవాది ఓఎస్ చందూర్కర్‌ని జస్టిస్ రేవతీ మొహితే, జస్టిస్ సందేశ్ బీ పాటిల్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం గురువారం ఆదేశించింది. మున్సిపల్ కార్పొరేషన్లను బాధ్యుల్ని చేయాలని, మున్సిపల్ అధికారుల జీతాల నుంచి పరిహారాన్ని రాబట్టాలని ధర్మాసనం తెలిపింది.
చిన్న జరిమానా సరిపోదని, వారికి కూడా నొప్పి తెలియాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రోడ్లపై గుంతల కారణంగా సంభవిస్తున్న మరణాలపై సుమోటోగా హైకోర్టు విచారణ చేపట్టింది. రోడ్ల దుస్థితికి కాంట్రాక్టర్లను కూడా జవాబుదారీగా చేయాలని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లోని అన్ని పురపాలక సంస్థలతోపాటు బీఎంసీని కూడా ధర్మాసనం ఆదేశించింది. కాంట్రాక్టర్లకు రూ.1 లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు జరిమానాలు విధించినట్లు న్యాయవాది తెలియచేయగా కోట్లాది రూపాయల కాంట్రాక్టులు పొందుతున్న వారికి ఈ జరిమానాలు సరిపోవని, వారికి భారీగా జరిమానాలు విధించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. తాము విస్తృతమైన అంశంగా ఈ సమస్యను పరిగణిస్తున్నామని, గుంతల కారణంగా ఏ వ్యక్తయినా మరణించడం లేదా గాయపడడం సంభవిస్తే అందుకు ఎవరు బాధ్యులని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ విషయంలో జవాబుదారీతనం ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది.