బాలాసోర్, జూలై 12: ‘నీవు ఇక్కడ చదువు కొనసాగించాలంటే నాకు లైంగిక ప్రయోజనాలు కల్పించాల్సిందే ’ అని డిమాండ్ చేస్తూ వేధించడమే కాక, అలా చేయకపోతే నీ భవిష్యత్తును నాశనం చేస్తానంటూ విభాగాధిపతి అధ్యాపకుడు చేస్తున్న వేధింపులు తట్టుకోలేక ఒక బీఈడీ విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. బాధిత యువతి తాను చదువుతున్న కాలేజీ ఆవరణలోనే నిప్పంటించుకున్న ఈ దుర్ఘటన బీజేపీ పాలిత ఒడిశాలో చోటుచేసుకుంది. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డారు. బాలాసోర్లోని ఫకీర్ మోహన్ కాలేజీలో ఈ దారుణం చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. కాలేజీలో బీఈడీ చదువుతున్న ఒక మహిళను లైంగిక కోరికలు తీర్చమంటూ హెచ్వోడీ సమీర్ కుమార్ సాహూ కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. దీనిపై బాధితురాలు ఈ నెల 1న అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు కూడా చేసింది. దీనిపై వారం రోజుల్లో చర్యలు తీసుకుంటారని ఆమె ఆశించింది. అయితే కమిటీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితురాలు, మిగతా విద్యార్థులు శనివారం కాలేజీ బయట గేట్ ముందు ఆందోళన నిర్వహించారు. హఠాత్తుగా బాధిత మహిళ.. ప్రిన్సిపల్ కార్యాలయం వద్దకు పరుగున వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి గాయపడ్డాడు. 95 శాతం గాయాలతో బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, హెచ్వోడీని, ప్రిన్సిపల్ను విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు రాష్ట్ర మంత్రి సూర్యబంశీ సూరజ్ తెలిపారు.