జైపూర్: రాజస్థాన్‌కు చెందిన బీజేపీ నేత జ్ఞాన్ దేవ్ అహుజా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘భారత్ మాతా కీ జై’ అనని వారిని కర్రలతో కొట్టాలని పిలుపునిచ్చారు. అల్వార్‌లో జరిగిన జన్ హుంకార్ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘ముస్లింలు భారతదేశాన్ని ఎప్పుడూ పాలించలేదు. మొఘలులు, ఆఫ్ఘన్లు భారత్‌ను పాలించారు. భారత్ మాతా కీ జై అనని వారిని కర్రలతో కొట్టండి’ అని అన్నారు.
కాగా, దేశంలోని ముస్లింలు ఒకప్పుడు హిందువులేనని, వారు బలవంతంగా మతం మారారని అహూజా తెలిపారు. మీ తాతలు, తండ్రులను కొట్టి బలవంతంగా ముస్లింలుగా మార్చారని చెప్పారు. నేటి ముస్లింలను మొగల్స్ హింసించారని, సోదరీమణులు, కూతుళ్లను అత్యాచారం చేశారని, ఆ తర్వాత వారు ఇస్లాం మతంలోకి మారారని అన్నారు. ఇది జరుగకపోయి ఉండి ఉంటే దేశంలో ప్రస్తుతం ఉన్న ముస్లింలంతా హిందువులేనని వ్యాఖ్యానించారు. హిందూ మతం నుంచే వారు ముస్లింలుగా మారారని, దీంతో ఏదో ఒక రోజు ముస్లింలంతా తిరిగి హిందువులవుతారని అన్నారు.
రాజస్థాన్‌లోని కరౌలి, జోధ్‌పూర్‌లో హింసాకాండతోపాటు అల్వార్ జిల్లా రాజ్‌గఢ్‌లోని పురాతన ఆలయాన్ని కూల్చిన ఘటనలకు నిరసనగా బీజేపీ జన్ హుంకార్ ర్యాలీని చేపట్టింది. ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సతీష్ పూనియా, కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, అరుణ్ చతుర్వేది సహా పలువురు బీజేపీ సీనియర్ నేతలు ఇందులో పాల్గొన్నారు.