న్యూఢిల్లీ, మే 13 : హిందూత్వం ఓ జీవన విధానమని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొన్నది. ఒక హిందువు తప్పనిసరిగా గుడికి వెళ్లడం గానీ, ఆచారాలు పాటించడం గానీ అవసరం లేదని, ఇంట్లో దీపం వెలిగించడం కూడా తమ విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి సరిపోతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేరళలోని శబరిమల ఆలయంతోసహా పలు మతపరమైన ప్రదేశాల్లో మహిళలపై వివక్షకు సంబంధించిన పిటిషన్లపైన, దావూదీ బోహ్రాలతోసహా పలు మతాలు పాటించే మత స్వేచ్ఛ పరిధిపైన విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అగస్టిన్ జార్జి మాసిహ్, జస్టిస్ ప్రసన్న ఆర్ వారాలే, జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి ఉన్నారు. 15వ రోజు విచారణ సందర్భంగా పిటిషనర్లలో ఒకరి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది డాక్టర్ జీ మోహన్ గోపాల్ తన వాదనలు వినిపిస్తూ మతవర్గాల నుండే సామాజిక న్యాయం కోసం డిమాండ్ వెలువడుతున్నదని అన్నారు. హిందూ మతాన్ని ఒక మత విభాగంగా నిర్వచించారు. తదనంతరం, 1966లో మతం, తత్వశాస్ర్తానికి సంబంధించిన అన్ని విషయాల్లో వేదాలను అత్యున్నత ప్రమాణంగా అంగీకరించనవాడే హిందువు అని తీర్పు ఇచ్చారు అని ఆయన చెప్పారు.
ఈ వాదనపై జస్టిస్ నాగరత్న స్పందిస్తూ అందుకే హిందూ మతాన్ని ఒక జీవన విధానం అని అంటారు. ఒక హిందువు హిందువుగా కొనసాగడానికి తప్పనిసరిగా గుడికి వెళ్లడం గానీ, ఏదైనా ఆచారాన్ని పాటించడం గానీ అవసరం లేదు అని అన్నారు. ఆచారాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదని, ప్రజలు తమ విశ్వాసాన్ని కలిగి ఉండటానికి ఎవరూ అడ్డురాలేదని ఆమె అన్నారు. ఒక వ్యక్తి తన గుడిసెలో దీపం వెలిగించినా కూడా అది అతని మతాన్ని నిరూపించడానికి సరిపోతుంది అని సీజేఐ వ్యాఖ్యానించారు. ప్రతి మత ఆచారాన్ని లేదా మత వ్యవహారాలను రాజ్యాంగ ధర్మాసనం ఎదుట వ్యక్తులు ప్రశ్నించుకుంటూ పోతే వందలాది పిటిషనర్లు వచ్చి పడతారని, ఫలితంగా ప్రతి మతం చీలిపోతుందని అంతకుముందు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. శతాబ్దాల నాటి హిందూ మత ఆచారం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని తీర్పునిస్తూ 10 నుంచి 50 సంవత్సరాల వయసుగల మహిళలు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తున్న నిషేధాన్ని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 2018 సెప్టెంబర్లో 4:1 మెజారిటీ తీర్పుతో తొలగించింది. దీన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రస్తుతం రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతున్నది.