HIndu mahasabha | ముజప్ఫర్పూర్లో హిందు మహాసభ దౌర్జన్యానికి దిగింది. కర్వా చౌత్ పర్వదినం సందర్భంగా మెహందీ డిజైన్లు వేసే వారు ముస్లింలు కాకుండా చూసుకోవాలంటూ హెచ్చరికలతో కూడిన స్వరం వినిపించారు. మెహందీ పేరుతో జిహదీలు హిందువులను ప్రలోభపెడతారని చెప్తూ పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
కర్వా చౌత్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తరాది రాష్ట్రాల్లో మహిళలు ముస్తాబుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఈ సందర్భంగా చేతులను మెహందీ డిజైన్లతో నింపుకోవడం ఆనవాయితీ. దీన్ని ఆసరాగా తీసుకుని ముస్లింలు హిందువులను ప్రలోభపెట్టే అవకాశాలు ఉన్నాయని హిందు మహాసభ ఊహాగానాలకు తెరలేపింది. అంతటితో ఊరుకోకుండా ముజఫ్ఫర్పూర్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలకు దిగారు. మెహందీ డిజైన్లు వేస్తున్న వారి వద్ద ఆధార్ కార్డులను పరిశీలించారు. ముస్లింల చేత డిజైన్లు వేయించుకోవద్దని హిందువులకు సూచిస్తున్నారు.
కర్వా చౌత్ సందర్భంగా మెహందీ పెట్టే అవకాశాన్ని ఆసరాగా చేసుకుని హిందూ సోదరీమణులను ప్రలోభపెట్టే అవకాశాలు ఉన్నందున ఇలా తనిఖీలు చేపట్టినట్లు హిందు మహాసభ జిల్లా అధ్యక్షుడు లోకేష్ సైనీ చెప్పారు. మెహందీ డిజైన్లు వేస్తున్న పలువురి వద్ద ఆధార్ కార్డులను పరిశీలించామే కానీ, ఎవర్నీ భయపెట్టలేదని ఆయన స్పష్టం చేశారు.