న్యూఢిల్లీ, జూలై 7: విలువైన ఆస్తి పత్రాలు, బంగారు నగలు, డబ్బు వంటి వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరిస్తే సురక్షితంగా ఉంటాయని మనం భావిస్తాం. కానీ హిమాచల్ ప్రదేశ్ వరదల్లో రాష్ట్ర సహకార బ్యాంక్ వరద నీటిలో మునిగిపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మండి జిల్లాలోని తునాగ్ మార్కెట్ ప్రాంతంలో ఈ సహకార బ్యాంక్ ఉంది. రెండంతస్తుల భవనంలో ఉన్న ఈ బ్యాంకులోని మొదటి అంతస్తు వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది. దీంతో బ్యాంక్‌లోని లక్షలాది రూపాయల నగదు, లాకర్లలో ఉన్న నగలు, ఆస్తుల పత్రాలు, లెడ్జర్లు, రికార్డులు పాడై ఉంటాయని బ్యాంక్ అధికారులు భావిస్తున్నారు. దొంగతనాలు జరుగుతాయేమోనని బ్యాంకు వద్ద స్థానికులు కాపలా కాస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన ఆస్తుల నష్టానికి ఇది ఒక ఉదాహరణ.
భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతున్నది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో రాష్ట్రంలో మృతుల సంఖ్య 78కు చేరుకుంది. వర్షాలు, వరదల వల్ల మరో 37 మంది ఆచూకీ గల్లంతైంది. వారి కోసం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. విపత్తు కారణంగా దాదాపు 115 మంది గాయపడ్డారని, రూ.500 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. రుతు పవనాలు ప్రారంభమైనప్పటి నుంచి జూలై 6 నాటికి రాష్ట్రంలో దాదాపు 23 ఆకస్మిక వరదలు సంభవించాయి. 19 చోట్ల క్లౌడ్ బరస్ట్‌లు ఏర్పడగా, 16 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షాల వల్ల రెండు జాతీయ రహదారులు సహా దాదాపు 243 రోడ్లను అధికారులు మూసివేశారు. 278 విద్యుత్తు కేంద్రాలు, 261 నీటి ప్రాజెక్టులు మూతపడ్డాయి. మరోవైపు వరదల వల్ల నాగాలాండ్‌లో ముగ్గురు మృతి చెందారు. అస్సాంలో మూడు నదులతో పాటు దేశ వ్యాప్తంగా 16 నీటి ప్రాజెక్టులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని కేంద్ర జల కమిషన్ తెలిపింది.