చైనాలో మళ్లీ కొవిడ్ విజృంభిస్తోంది. షాంఘైలో లాక్డౌన్ విధించారు. భవిష్యత్తులో కరోనా ఫోర్త్‌వేవ్ ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి భారత్ పరిస్థితి ఏంటి? ఇప్పటికే చాలామంది బూస్టర్ డోస్ టీకాలు కూడా తీసుకొని ఉన్నారు. ప్రస్తుతం రోజుకు 2,000 కేసులు నమోదవుతున్నాయి. మరి ఫోర్త్ వేవ్ వస్తే ఈ కేసుల సంఖ్య పెరుగుతుందా? గత వేవ్‌ల మాదిరిగా ప్రాణ నష్టం ఉంటుందా? అంటే భయపడాల్సిన పనిలేదని అంటున్నారు పరిశోధకులు. 90శాతం కంటే ఎక్కువ మంది భారతీయులు సహజ రోగనిరోధక శక్తి కలిగి ఉన్నారని సూత్ర (SUTRA) మ్యాథమెటికల్ మోడల్ ద్వారా అంచనా వేశారు.
సూత్ర మోడల్ ఏం చెప్తోందంటే?
ప్రపంచంలోని చాలాదేశాల్లోని ప్రజల్లో వ్యాక్సిన్ వల్ల రోగనిరోధకశక్తికంటే సహజ రోగనిరోధక శక్తే ఎక్కువగా ఉందని, వీటిని పోల్చి చూస్తే భారత్‌లో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తేలిందని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ డాక్టర్ మనీంద్ర అగర్వాల్ చెప్పారు. మనీంద్ర అగర్వాల్ సూత్ర నమూనా రూపొందించిన బృందానికి నాయకత్వం వహించారు. కొవిడ్ మూడు వేవ్‌ల సందర్భంలో ఈ నమూనా అంచనాలు తప్పలేదు.
ఒమిక్రాన్ వేరియంట్ ప్రారంభంలో 80శాతం మంది భారతీయులకు సహజ రోగనిరోధక శక్తి ఉందని, 57శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇమ్యూనిటీ ఉన్నట్లు సూత్ర నమూనా ద్వారా తేల్చామని మనీంద్ర అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం 90శాతం మంది భారతీయులకు సహజనిరోధకశక్తి ఉందని తెలిపారు. అలాగే, తమ గణిత నమూనా వైరస్ కొత్త మ్యుటేషన్‌ను అంచనా వేయలేదని తెలిపారు.
దేశంలో కొవిడ్ చివరిదశకు చేరుకుంటుందా?
చైనా, దక్షిణకొరియాలాంటి దేశాల్లో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో దేశంలో ఫోర్త్ వేవ్‌పై చర్చలు మొదలయ్యాయి. అదేసమయంలో జూన్‌లో దేశంలో ఫోర్త్‌వేవ్ ఉంటుందని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన మరో పరిశోధక బృందం అంచనా వేసింది. అయితే, దీనిని చాలా మంది నిపుణులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. అధ్యయనం ఇంకా పీర్-రివ్యూ చేయాల్సి ఉంది.
అదే సమయంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్-19 టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్ఖోవ్ కొవిడ్-19 చివరిదశ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫోర్త్ వేవ్ తక్కువ ప్రమాదకరమైనదని చెప్పారు. దీనర్థం తక్కువ ప్రాణాంతకం అని కాదన్నారు. తగిన జాగ్రత్తలు పాటించాల్సిందేనని సూచించారు. మరోవైపు ది లాన్సెట్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ డైరెక్టర్ క్రిస్టోఫర్ జేఎల్ ముర్రే కొవిడ్ -19 రాబోయే స్థితిని అంచనావేశారు. ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత కూడా మరో వేవ్ ఉంటుందని, కానీ, అది మునుపటిలా ప్రమాదకారి కాదని చెప్పారు.