
న్యూఢిల్లీ, నవంబర్ 12: క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొట్టివేయడానికి పోలీసులు ఇంకా మేజిస్టీరియల్ కోర్టు ముందు దాఖలు చేయని ముసాయిదా చార్జిషీట్‌పై హైకోర్టులు ఆధారపడకూడదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హైకోర్టులు తమ అధికారాలను ఉపయోగించేప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించింది. బెదిరించి డబ్బు వసూలు చేసిన కొందరు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ను గుజరాత్ హైకోర్టు కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పుపై పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముసాయిదా చార్జిషీట్‌ను దాఖలు చేయమని ఆదేశించిన హైకోర్టు… దాన్ని పరిశీలించి ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది. అప్పటికి ఇంకా మేజిస్టీరియల్ కోర్టులో చార్జిషీట్ దాఖలు కాలేదు. గుజరాత్ హైకోర్టు తన పరిమితులను అతిక్రమించిందని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన బెంచ్ తీర్పులో పేర్కొంది.