కోజికోడ్, ఆగస్టు 17: ఫిర్యాదుదారు లైంగికంగా రెచ్చగొట్టే దుస్తులు వేసుకున్నప్పుడు.. వాళ్లు చేసే లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రాథమికంగా నిలబడవని కేరళలోని కోజికోడ్ సెషన్స్ కోర్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. నిందితుడు దాఖలు చేసిన పిటిషన్ను సమర్థిస్తూ బెయిల్ మంజూరు చేసింది.
కేరళకు చెందిన 74 ఏండ్ల రచయిత చంద్రన్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ యువ రచయిత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండేండ్ల క్రితం ఈ ఘటన జరగ్గా.. గత నెలలో పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. దీంతో నిందితుడు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. నాటి ఘటన సమయంలో సదరు యువ రచయిత్రి ఫొటోలను కోర్టుకు సమర్పించాడు. బాధితురాలి ఫొటోలను ఉద్దేశిస్తూ ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.