రాంచీ, నవంబర్ 24 : జార్ఖండ్ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ప్రస్తుత సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత హేమంత్ సొరేన్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలంతా ఆదివారం హేమంత్ సొరేన్ నివాసంలో సమావేశమై ఆయనను తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం హేమంత్ సొరేన్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్‌ను కలిశారు. ఇండియా కూటమి ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఆయనకు సమర్పించి, తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ హేమంత్ సొరేన్‌ను గవర్నర్ ఆహ్వానించారు. అంతకుముందు సీఎం పదవికి రాజీనామా చేసిన హేమంత్ సొరేన్.. ఈ నెల 28న నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అప్పటివరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.