Hema Malini | ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట విషయంలో ప్రభుత్వం మృతుల వివరాలను దాచిపెడుతుందని ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలపై బీజేపీ ఎంపీ, ప్రముఖ సినీ నటి హేమా మాలిని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాలో తొక్కిసలాట ఘటన అంత పెద్దదేం కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహా కుంభమేళాకు ఎంతో మంది వస్తున్నారని.. అక్కడ నిర్వహణ అంతా బాగానే ఉందన్నారు. జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా భక్తులు త్రివేణి సంగమంలో స్నానాల కోసం పోటీపడ్డ విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగి 30 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 60 మంది గాయపడ్డారు.
ప్రతిపక్షాల ఆరోపణలపై హేమామాలిని స్పందిస్తూ ‘మేము కుంభమేళాకు వెళ్లాం. స్నానాలు చేశాం. అక్కడ నిర్వహణ అంతా బాగుంది. ఎక్కడకు వెళ్లినా నిర్వహణ పనులు బాగున్నాయి. అవును తొక్కిసలాట జరిగింది. కానీ, అంత పెద్ద ఘటనేం కాదు. చాలా మంది అక్కడికి వస్తున్నారు. అంత జనాలను నియంత్రించడం కష్టమైన పని. అయినా యూపీ ప్రభుత్వం బాగానే నిర్వహిస్తుంది’ అని పేర్కొన్నారు. తొక్కిసలాట జరిగిన సమయంలో హేమామాలిని సైతం త్రివేణి సంగమంలో స్నానాలు చేశారు. అయితే, తొక్కిసలాటలో మృతుల సంఖ్యను ప్రభుత్వం దాచిపెడుతుందని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. వారికి ఏం కావాలంటే అది చెబుతారంటూ బదులిచారు. అక్కడ అంతా బాగానే ఉందని.. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ సైతం స్నానం చేయబోతున్నారు అని తెలిపారు. మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై మంగళవారం పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి.
తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్యను ప్రభుత్వం దాచిపెడుతోందని సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. కుంభమేళాలో నిర్వహణ లోపాలు దాచేందుకు ప్రయత్నిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక హేమామాలిని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. బీజేపీ ప్రభుత్వ అసమర్థత కారణంగా కుంభమేళాలో పెద్ద సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని తెలిపింది. నటి వ్యాఖ్యలు సిగ్గుచేటని.. బీజేపీ అసమర్థతకు పరాకాష్టగా పేర్కొంది. బీజేపీ ప్రభుత్వం ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని.. ఎందరు ప్రాణాలు కోల్పోయారో ఇప్పటి వరకు వెల్లడించలేదని పేర్కొన్నారు. ఘటనను అణచివేసేందుకు ఉన్న శక్తినంతా ఉపయోగిస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది.