హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): నేపాల్‌లో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర పౌరుల కోసం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. దీని ద్వారా నేపాల్‌లో చికుకున్న తెలంగాణ పౌరులకు సహాయం చేయనునున్నట్టు వెల్లడించింది. ఇప్పటివరకు నేపాల్‌లో తెలంగాణ పౌరులెవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, కాఠ్మాండులోని భారత రాయబార కార్యాలయంతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నదని తెలిపింది. నేపాల్‌లో ఎవరైనా తెలంగాణ పౌరులు చికుకుంటే వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని తెలంగాణభవన్ అధికారులను 9871999044, 9643723157, 9949351270 నంబర్లను సంప్రదించాలని సూచించింది. తెలంగాణపౌరులు, వారి కుటుంబ సభ్యులు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని స్పష్టంచేసింది.
హోటల్‌కు నిప్పుపెట్టి కర్రలతో వెంటపడ్డారు! ; దీనస్థితిలో భారతీయ మహిళ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: తాను బసచేసిన హోటల్‌కు నిప్పుపెట్టడంతోపాటు తనపై దాడి చేసేందుకు వెంటపడిన ఆందోళనకారుల నుంచి ప్రాణాలు దక్కించుకున్న ఓ భారతీయ మహిళ తనను కాపాడాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంది. ఉపాసనా గిల్ అనే మహిళకు చెందిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నేపాల్‌లోని పోఖరలో తాను బసచేసిన హోటల్‌ను జన్ జెడ్ నిరసనకారులు తగలబెట్టారని ఆ మహిళ తెలిపింది. తాను స్పాలో ఉన్న సమయంలో ఆందోళనకారులు హోటల్‌కు నిప్పుపెట్టారని, తాను స్పాలో నుంచి బయటకు రాగానే కర్రలు పట్టుకుని ఉన్న వారంతా తనపై దాడి చేసేందుకు వెంటపడ్డారని తెలిపారు. తాము పర్యాటకులమని చెప్పినా ఎవరూ లెక్కచేయడం లేదన్నారు. తనలాగే చాలామంది ఇక్కడ చిక్కకుపోయారని, తమను కాపాడాలని ఆమె భారత ప్రభుత్వాన్ని అర్థించారు.