డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని గౌరీ కుండ్‌లో హెలికాప్టర్ కుప్పకూలింది (Helicopter Crashes). దీంతో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఆర్యన్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్.. కేదార్నాథ్ ఆలయం నుంచి గుప్తకాశీకి వెళ్తున్నది. ఈ క్రమంలో వాతావరణం అనుకూలించకపోవడంతో అదుపుతప్పిన హెలికాప్టర్ గౌరీకుండ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. దీంతో అందులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో పైలట్‌తోపాటు ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఆరుగురు ప్రయాణికులు, పైలట్ ఉన్నారు.
అంతకు ముందే ఆ హెలికాప్టర్ గుప్తకాశి నుంచి కేదార్నాథ్ వెళ్లిందని అధికారులు తెలిపారు. తిరిగి గుప్తకాశికి వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఘటనా స్థలానికి రెస్క్యూ సిబ్బందిని పంపామని, అయితే హెలికాప్టర్ దట్టమైన అటవీ ప్రాంతంలో పడిపోవడంతో అక్కడికి చేరుకోవడం కొంత ఆలస్యమవుతుందని వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.