Heavy Snowfall | జమ్మూ కశ్మీర్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠస్థాయికి పడిపోవడంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎడతెరిపిలేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. కశ్మీర్ వ్యాలీలో ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. కనుచూపుమేర శ్వేత వర్ణం అలుముకుంది. అక్కడ రోడ్లన్నీ శ్వేతవర్ణాన్ని తలపిస్తున్నాయి. కాశ్మీర్ లోయలోని ఏ ప్రాంతంలో చూసినా హిమపాతమే కనిపిస్తోంది. శ్రీనగర్, రాజౌరి, సోన్మార్గ్, బందీపురాతో పాటూ చాలా ప్రాంతాల్లో రోడ్లపై మంచు పేరుకుపోయింది. గుల్మార్గ్, పహల్గావ్ పర్యాటక రిసార్ట్లు మంచుతో నిండిపోయాయి. భారీగా కురుస్తున్న మంచు కారణంగా కశ్మీర్ ప్రజలు గజగజ వణికిపోతున్నారు.
రహదారులపై భారీగా మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో శ్రీనగర్‌లోని ప్రధాన రహదారులను అధికారులు మూసివేశారు. జమ్మూ-శ్రీనగర్, శ్రీనగర్-లెహ్ జాతీయ రహదారులతోపాటు వ్యాలీలోని పలు ప్రధాన రోడ్లను అధికారులు మూసివేశారు. మరోవైపు భారీగా కురుస్తున్న మంచు కారణంగా విజబిలిటీ తక్కువగా ఉండటంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. ‘భారీగా మంచు కురుస్తుండటంతో విజబిలిటీ 200 మీటర్లుగా ఉంది. దీంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి’ అని ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు.
ఈ మంచు వర్షం రైళ్ల రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. రైలు పట్టాలపై భారీగా మంచు పేరుకుపోవడంతో అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. పట్టాలపై పేరుకుపోయిన మంచును తొలగించే పనులు చేపట్టారు. మంచు తొలగింపు చర్యలు పూర్తయ్యాక రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.
మరోవైపు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో నిర్వహించాల్సిన పరీక్షలను అక్కడి ప్రభుత్వం వాయిదా వేసింది. ‘భారీగా మంచు కురుస్తుండటంతో ఈ నెల 30వ తేదీన (జనవరి 30, సోమవారం) జరగాల్సిన అన్ని పీజీ, ఇంజినీరింగ్ తదితర పరీక్షలు వాయిదా వేస్తున్నాం. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత కొత్త తేదీలను ప్రకటిస్తాం’ అని అక్కడి అధికారులు వెల్లడించారు.
#WATCH | J&K: Srinagar and other parts of Kashmir valley receive fresh snowfall. pic.twitter.com/mBYzzwHciI
— ANI (@ANI) January 30, 2023
#WATCH | Kashmir valley covered in a sheet of snow as Srinagar and other parts of the valley received fresh snowfall.
Visuals from Srinagar, this morning. pic.twitter.com/J678e8LwfY
— ANI (@ANI) January 30, 2023