ముంబై, జూలై 22: భారీ వర్షాలతో మహారాష్ట్ర చిగురుటాకులా వణికిపోతున్నది. పలు జిల్లాలు వరదల్లో చిక్కుకొన్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రవాహ ఉద్ధృతికి గురువారం మహారాష్ట్రలో వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు కొట్టుకుపోయారు. వీరిలో ముగ్గురు చనిపోయారు. ఇద్దరు ఉల్హాస్ నదిలో గల్లంతయ్యారు. గల్లంతైన ఇద్దరు తండ్రీ, కూతురు. వీరికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పాల్ఘడ్ జిల్లాకు చెందిన గౌతమ్ శిరీష్(18) కరెంట్ షాక్‌తో చనిపోయాడు. అదే జిల్లాకు చెందిన రమా ఠాక్రే(53), దర్శన్ దిలీప్(50) వరదల్లో కొట్టుకుపోయి మరణించారు. రాయ్‌గఢ్ జిల్లాలో సావిత్రి నది ప్రవాహ ధాటికి సంజయ్ నర్ఖేడే కొట్టుకుపోయాడు. వర్షాలు, వరదల కారణంగా ముంబై సహా రాష్ట్రవ్యాప్తంగా రవాణా సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న కారణంగా ప్రజలు అనవసరంగా ఇండ్ల నుంచి బయటకు రావొద్దని జిల్లాల అధికారులు హెచ్చరించారు. రత్నగిరి జిల్లాలోని పరశురామ్ ఘాట్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మరోవైపు, కేరళలోని ఎర్నాకుళం, ఇడుక్కి, వయనాడ్‌లో శుక్రవారం అతి భారీ వర్షాలు కురవొచ్చని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
చిక్కుకుపోయిన 6వేల మంది ప్రయాణికులు
మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని కొంకణ్ రైల్వే రూట్లో ఓ నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీంతో ఆ రూట్లో వెళ్లే 9 సర్వీసులను అర్ధంతరంగా నిలిపివేశారు. వేర్వేరు స్టేషన్లలో ఆపివేశారు. 6 వేల మందికి పైగా ప్రయాణికులు ఈ సర్వీసుల్లో చిక్కుకుపోయారు. వారికి ఆహారం, నీరు అందించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అందరూ సురక్షితంగా ఉన్నట్టు తెలిపారు. ఈ రైళ్లను వేరే రూట్లకు మళ్లించడం, సాధ్యం కాని పరిస్థితుల్లో తాత్కాలికంగా రద్దు చేస్తామని తెలిపారు. ప్రయాణికులను స్వస్థలాలకు పంపించడానికి ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు.