పాటియాల, మే 16: పంజాబ్లో బీజేపీ అభ్యర్థులకు రైతుల నుంచి తీవ్ర నిరసన సెగ ఎదురవుతున్నది. కమలం పార్టీల అభ్యర్థుల ప్రచారాన్ని అన్నదాతలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. గ్రామాల్లోకి బీజేపీ అభ్యర్థులను రానివ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. తమ డిమాండ్లపై ఆ పార్టీ నేతలను నిలదీస్తున్నారు.
ప్రచారం అడ్డుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇటీవల ఎన్నికల సంఘానికి రైతులపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రైతు సంఘాల నేతలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సమావేశం నిర్వహించారు. అయినప్పటికీ రైతులు వెనక్కి తగ్గలేదు. బీజేపీ నేతల ప్రచారాన్ని అడ్డుకుంటూనే ఉన్నారు. గత వారం వ్యవధిలో ఇలాంటి కేసులు 24 నమోదయ్యాయి. రైతులను అదుపు చేయలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
బీజేపీ నేతలందరిదీ ఇదే పరిస్థితి
బుధవారం బీజేపీ నేత ప్రణీత్ కౌర్ పర్యటన సందర్భంగా నిరసన తెలపడానికి రైతులు ప్రయత్నించారు. దీనిని పోలీసులు గట్టిగా అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఒక రైతు తలపాగా ఎగిరిపోవడంతో పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ రైతులు ధర్నాకు దిగడంతో ఆ కార్యక్రమం రసాభాసగా మారింది. ఇది ఒక్క ప్రణీత్ కౌర్కే కాదు. అన్ని నియోజవకర్గాల్లోని బీజేపీ అభ్యర్థులకు ఇదే పరిస్థితి ఏర్పడుతున్నది. దీనిపై లా అండ్ ఆర్డర్ స్పెషల్ డీజీపీ అర్పిత్ శుక్లా మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు రైతులుకు ఉందని, అయితే అదే సమయంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్న విషయాన్ని మరువరాదని అన్నారు.
త్వరలో ప్రధాని, అమిత్ షాల పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల పర్యటన త్వరలో ఉండటంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి అనూహ్య ఘటనలు జరగకుండా తగిన సిబ్బందిని మోహరించాలని నిర్ణయించింది. ముఖ్యంగా వీరి సభల్లో నిరసనలు, నిలదీతలు, వాగ్వాదాలు లాంటివి చోటుచోసుకోకుండా ముందస్తు వ్యూహాలను అమలు చేస్తున్నారు. పోలీసులు ఇంత పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నా రైతులు వేదికల వద్దకు చేరుకుని అలజడి సృష్టించడం ఖాయమన్న భయం అటు నేతల్లో, ఇటు పోలీసుల్లో ఉంది.