న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: శుక్రవారం మధ్యాహ్నం ఓ గంటసేపు కురిసిన భారీ వర్షానికి దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలమైంది. దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), పశ్చిమ ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. సాగర్పూర్లోని గాంధీ మార్కెట్ సహా అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది. చాలా చోట్ల నివాస కాలనీల్లోని రోడ్లు నీట మునిగి, చెరువులను తలపిస్తున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్లో భారీ వర్షపాతంపై రెడ్ వార్నింగ్ జారీచేసింది. శనివారం భారీ వర్షాలు, ఉరుములతో కూడిన తుఫానులు ఉంటాయని తెలిపింది.
నీట మునిగిన విమానాశ్రయం
భారీ వర్షానికి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నీరు నిలిచిపోయి, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు విమానాశ్రయంలోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కొంతమంది లగేజీ ట్రాలీలను నీటిలో నెట్టుకుంటూ ప్రవేశ ద్వారాల వైపు వెళ్లడం కనిపించింది.