Heat wave days : దేశంలో ఈ ఏడాది కూడా ఎండలు దంచికొడుతాయని భారత వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. ముఖ్యంగా వాయవ్య భారతదేశం (Northwest India) లో ఎండలు మండిపోనున్నాయని తెలిపింది. నార్తవెస్ట్ ఇండియాలో ప్రతి ఏడాది అత్యంత వేడి రోజులు నమోదవుతాయని, ఈ ఏడాది వేడి రోజుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని, అంటే 10 నుంచి 12 హీట్ వేవ్ డేస్ నమోదు కావచ్చని ఐఎండీ అంచనా వేసింది.
వేడి రోజులు ఎక్కువగా నమోదవుతాయంటే సీజన్ మొత్తం వేడి వాతావరణం ఉంటుందని అర్థం కాదని, ఆయా హీట్ వేవ్ డేస్లో మాత్రమే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ శాస్త్రవేత్త సోమా సేన్ రాయ్ చెప్పారు. అయితే 2024 కంటే ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉండనున్నాయా అన్న ప్రశ్నకు ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. 2024 సంవత్సరం భారతదేశ చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా రికార్డుల్లోకి ఎక్కింది. గత ఏడాది దేశంలో 554 అత్యంత వేడి రోజులు నమోదయ్యాయి.
అదేవిధంగా ఈ వేసవిలో దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటె తక్కువ కనిష్ఠ ఉష్ణోగ్రతలు, సాధారణం కంటే ఎక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కూడా ఉన్నదని ఐఎండీ అంచనా వేసింది. రాగల నాలుగైదు రోజుల్లో ఉత్తర భారతదేశంలో ఎండల తీవ్రత పెరగనుందని, దేశ రాజధాని ఢిల్లీ దాని పరిసర రాష్ట్రాల్లో ఒకటి నుంచి రెండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని ఐఎండీ తెలిపింది.