ఢిల్లీ, మార్చి 14 (నమస్తే తెలంగాణ): బిల్లులను పెండింగ్‌లో పెట్టుకుని గవర్నర్ కూర్చోవటాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఆమోదం కోసం పంపిన పది బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ తన వద్ద పెండింగ్‌లో పెట్టుకోవటాన్ని తీవ్ర విషయమని ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వివరించారు. ఈనెల 2న పిటిషన్ దాఖలు చేశామని, కేసు విచారణ జాబితాలో లేదని, ప్రభుత్వం ప్రజాభీష్టానికి అనుగుణంగా చట్టసభలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయడం లేదని చెప్పారు.
తర్వాత విచారణ చేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం చెప్పింది. దీనిపై దవే స్పందిస్తూ, దీనిపై వెంటనే విచారణ చేయాల్సిన అవసరం ఉన్నదని, కనీసం ఈ నెల 20 తేదీన విచారణ చేపట్టాలని కోరారు. అందుకు ధర్మాసనం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. పది బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ కాలయాపన చేయటాన్ని తప్పుపడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి 194 పేజీల పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇందులో గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు.
శాసనసభ, శాసనమండలి ఉభయ సభలు బిల్లులను ఆమోదించిన తర్వాత గవర్నర్‌కు పంపితే గత ఆరు నెలలుగా ఏడు బిల్లులు, గత నెల రోజులకుపైగా మూడు బిల్లులు మొత్తం పది బిల్లులకు రాజ్‌భవన్ ఆమోదం చెప్పలేదని దవే వివరించారు. ప్రజాప్రభుత్వం చట్టసభల ద్వారా తీసుకున్న నిర్ణయాల అమలుకు గవర్నర్ ఆమోదముద్ర వేయకపోవటం రాజ్యాంగ వ్యతిరేకమని వాదించారు.
రాజ్యాంగంలోని 200వ అధికరణం ప్రకారం శాసనసభలు ఆమోదించిన బిల్లులను ప్రభుత్వం గవర్నర్‌కు నివేదించాలి. ఆ బిల్లులను గవర్నర్ ఆమోదించడమో లేక వెనకి పంపడమో చేయాలి. లేనిపక్షంలో రాష్ట్రపతి పరిశీలనకు బిల్లులను నివేదిస్తునట్టుగా గవర్నర్ స్పష్టంచేయాలి. గవర్నర్ ఏదైనా బిల్లును తిరిగి పంపితే చట్టసభలు పునఃపరిశీలన చేసి ఆ బిల్లును యథాతథంగా తిరిగి ఆమోదిస్తే గవర్నర్ విధిగా వాటికి ఆమోదం చెప్పితీరాలి. ఎలాంటి పరిస్థితుల్లో గవర్నర్ బిల్లులను తన వద్ద పెండింగ్‌లో పెట్టుకోడానికి వీల్లేదు. రాజ్యాంగంలోని 163వ అధికరణం కింద గవర్నర్ బిల్లులకు ఆమోదం చెప్పాలి.
ఆ అధికరణం ప్రకారం గవర్నర్ సీఎం అధ్యక్షతన మంత్రిమండలి తీసుకునే నిర్ణయాలను విధిగా అమలు చేయాలి.. అని సీఎస్ దాఖలు చేసిన వ్యాజ్యంలో పేరొన్నారు. బిల్లులను పెండింగ్‌లో పెట్టుకోవడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గేలి చేయడమే. బిల్లులపై సంబంధిత మంత్రులు గవర్నర్‌ను కలిసి వివరణలు ఇచ్చిన తర్వాత కూడా గవర్నర్ తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. త్వరలోనే బిల్లులకు ఆమోదం లభిస్తుందని గవర్నర్ వెల్లడించినా కార్యరూపం దాల్చలేదు. అని సీఎస్ శాంతికుమారి తన పిటిషన్లో పేర్కొన్నారు.
పది పెండింగ్ బిల్లులు ఇవే
ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లు, తెలంగాణ మున్సిపల్ చట్టసవరణ బిల్లు, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సవరణ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, తెలంగాణ ఫారెస్ట్ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ మోటర్ వెహికల్ చట్టసవరణ బిల్లు, తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ (ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్) సవరణ బిల్లులు గతేడాది సెప్టెంబర్ నుంచి గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సవరణ బిల్లు, తెలంగాణ పంచాయితీ రాజ్, మున్సిపాల్టీల చట్టసవరణ బిల్లులు ఈ ఏడాది ఫిబ్రవరి 13 వ తేదీ నుంచి గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.