పాట్నా: బైక్ నుంచి పడిన యువకుడికి కాలు విరిగింది. అయితే చికిత్స అందించిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్లాస్టర్‌కు బదులు కార్డ్‌బోర్డ్‌తో కాలుకు కట్టుకట్టారు. (Fractured Leg With Cardboard) ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి అతడ్ని తరలించినప్పటికీ అట్టముక్క కట్టును అలాగే ఉంచారు. ఈ నేపథ్యంలో దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బైక్‌పై వెళ్తున్న నితీశ్ కుమార్ అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో అతడి కాలు విరిగింది. మినాపూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా అక్కడ అట్టపెట్టె ముక్కతో కాలుకు కట్టుకట్టారు.
కాగా, మెరుగైన వైద్యం కోసం ఆ యువకుడ్ని ముజఫర్‌పూర్‌లోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయితే తాత్కాలికంగా అట్ట ముక్కతో కట్టిన కట్టును అక్కడి డాక్టర్లు తొలగించలేదు. ఐదు రోజులపాటు ఏ డాక్టర్ కూడా అతడ్ని పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. యువకుడి కాలుకు అట్టముక్కతో కట్టుకట్టిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరోవైపు మెడికల్ కాలేజీ ఆసుపత్రి సూపరింటెండెంట్ దీనిపై స్పందించారు. కాలు విరిగిన యువకుడికి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు చెబుతానని తెలిపారు. అలాగే అట్టముక్క కట్టును ఎందుకు తీయలేదో అన్నదానిపై దర్యాప్తు జరిపిస్తానని చెప్పారు. ఆ కట్టుకట్టిన ప్రాథమిక ఆసుపత్రి సిబ్బందిదే తప్పని అన్నారు.