Actor Vijay : తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) ఇవాళ నాగపట్టణం (Nagapattanam) లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన శ్రీలంక తమిళుల (Srilanka Tamilians) అంశాన్ని లేవనెత్తారు. వారిపై రాజీవ్‌గాంధీ హంతకుడు, ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ (Velupillai Prabhakaran) ప్రేమ చూపించాడని అన్నారు.
‘ఈలం తమిళులు శ్రీలంకలో ఉన్నా, ప్రపంచంలో మరేచోట ఉన్నా, గొప్ప నాయకుడిని కోల్పోయి బాధపడుతున్నారు. వారికోసం మన గళాన్ని వినిపించాల్సిన అవసరం ఉంది’ అని విజయ్ అన్నారు. ఒకప్పటి ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక తమిళులకు అనుకూలంగా విజయ్ మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. 2008లో ఆ దేశంలో తమిళుల హత్యకు నిరసనగా చెన్నైలో జరిగిన నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు.
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తమిళనాడు రాజకీయాల్లో ఈ అంశం కూడా ప్రచారాస్త్రంగా పనిచేస్తుంటుంది. తమిళనాడులో మరీ ముఖ్యంగా నాగపట్టణంలోని మత్స్యకారుల్లో ఇదొక భావోద్వేగపూరిత అంశం. ‘మత్స్యకారుల సమస్య గురించి సుదీర్ఘ లేఖ రాసి, ఆపై మౌనంగా ఉండే డీఎంకే ప్రభుత్వం లాంటి వాళ్లం మేము కాదు. వారి సమస్యకు పరిష్కారం కొనడం మా కీలక అజెండాలలో ఒకటి. మన జాలర్లపై శ్రీలంక నావికా దళ దాడులకు గల కారణాలు, పరిష్కారాలపై నేను మధురై సమావేశంలో మాట్లాడా. వారికి అండగా నిలబడటం మా కర్తవ్యం’ అని అన్నారు.
ఇదిలాఉంటే.. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని 1991 మే 21న చెన్నైకి సమీపంలోని శ్రీ పెరంబుదూరు వద్ద ఎల్టీటీఈ బృందం మానవ బాంబు ప్రయోగించి హతమార్చింది. రాజీవ్‌గాంధీ హత్యకు కుట్రచేసి, అమలు చేసిన ప్రభాకరన్‌ను విజయ్ ప్రశంసించడం చర్చనీయాంశంగా మారింది.