ఆదివారం 29 మార్చి 2020
National - Mar 07, 2020 , 00:37:48

పోస్టుమార్టాన్ని వీడియో తీయండి

పోస్టుమార్టాన్ని వీడియో తీయండి
  • డీఎన్‌ఏ నమూనాలు భద్రపరచండి
  • ఢిల్లీ ఘర్షణలపై హైకోర్టు సూచన

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో జరిగిన మత ఘర్షణల్లో మరణించిన వారి మృతదేహాలకు నిర్వహించే పోస్టుమార్టాన్ని వీడియో రికార్డు చేయాలని, వాటి డీఎన్‌ఏ నమూనాలను భద్రపరచాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. వచ్చే బుధవారం వరకు మృతదేహాలను ఖననం చేయవద్దని స్పష్టంచేసింది. హింసాకాండ జరిగిన నాటి నుంచి తన బావ హంజా కనిపించడం లేదంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై న్యాయమూర్తులు సిద్ధార్థ మృదుల్‌, ఐఎస్‌ మెహతాతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. కాగా, గోకుల్‌పురి ప్రాంతంలోని మురికికాలువలో హంజా మృతదేహాన్ని సోమవారం గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు.


ఆ మృతదేహానికి ఆర్మెల్‌ దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హింసాకాండకు సంబంధించినవి, గుర్తుతెలియని మృతదేహాలకు నిర్వహించే పోస్టుమార్టాన్ని వీడియో తీయాలని, డీఎన్‌ఏ నమూనాలను భద్రపరచారని ఆయా దవాఖానలకు హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. మృతుల ఫొటోలు, వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని పోలీసులకు సూచించింది. హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌దారుడిని దవాఖానలకు తీసుకెళ్లి హంజా మృతదేహాన్ని గుర్తించేందుకు సహకరించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. 


logo