బాంకా, ఆగస్టు 18: శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమా చూశారా..? అందులో హీరో డాక్టర్ కాకపోయినా ఓ నకిలీ దవాఖాన పెడుతాడు. అచ్చు దవాఖానలాగే సెటప్ కూడా వేస్తారు. అయితే బీహార్‌లో కూడా ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. అక్కడి ఓ గ్యాంగ్ ఏకంగా ఓ పోలీస్ స్టేషన్‌నే ఏర్పాటు చేసింది. ఏకంగా 8 నెలల పాటు దీన్ని నడిపింది. తాజాగా ఈ ముఠా గుట్టు రట్టయింది. బాంకా సిటీలో ఈ నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు.
పైగా స్థానిక పోలీస్ అధికారి ఇంటికి 500 మీటర్ల దూరంలోనే దీన్ని నడపడం గమనార్హం. పోలీస్ యూనిఫాం, ర్యాంకు బ్యాడ్జీలు ధరించి, తుపాకులు పట్టుకుని తిరిగారు. స్థానికుల నుంచి భారీమొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కొందరిని రోజుకు రూ.500 చెల్లించి, ఆ స్టేషన్లో పోలీసులుగా నటించేందుకు నియమించుకున్నారు. ఇద్దరు దుండగులు పోలీస్ డ్రెస్ వేసుకుని నాటు తుపాకులు పట్టుకుని తిరుగుతుండగా ఓ పోలీసు అధికారి చూసి పై అధికారులకు సమాచారం ఇవ్వడంతో వీరి బండారం బయటపడింది. పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.