Hate speech Law : విద్వేష ప్రసంగాలు, విద్వేషపూరిత నేరాల కట్టడి కోసం కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) తీవ్ర కసరత్తు చేస్తోంది. అందుకోసం కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. త్వరలో దీనికి సంబంధించి ముసాయిదా బిల్లు (Draft bill) ను రూపొందించనున్నట్లు తెలిపింది. విద్వేష ప్రసంగాలు చేసేవాళ్లకు, విద్వేష కార్యకలాపాలకు పాల్పడేవాళ్లకు కఠిన శిక్షలు, తీవ్రమైన జరిమానాలు విధించేలా ఈ చట్టాన్ని రూపొందించబోతున్నారు.
బహిరంగ సభల్లో విద్వేష ప్రసంగాలను ఈ కొత్త చట్టం నిరోధించనుంది. ఒక వ్యక్తినిగానీ, ఒక సంఘాన్ని గానీ, కులం పేరుతో, మతం పేరుతో, లింగం పేరుతో ద్వేషించకుండా ఈ బిల్లు అడ్డుకుంటుంది. సోషల్ మీడియాలో ప్రసారమయ్యే విద్వేషపూరిత కంటెంట్‌ను కొత్త చట్టం నిరోధిస్తుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కనిష్ఠంగా మూడేళ్లు, గరిష్ఠంగా ఐదేళ్ల జైలుశిక్ష పడనుంది.
మళ్లీ మళ్లీ చట్టాన్ని ఉల్లంఘించేవారికి అంతకంటే కఠిన శిక్షలు వేసేందుకు చట్టం అవకాశం కల్పిస్తుంది. దీనికి సంబంధించి త్వరలో ముసాయిదా బిల్లును రూపొందించి న్యాయ సలహా కోరాలని కర్ణాటక సర్కారు భావిస్తోంది. మార్చిలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ ప్రక్రియను పూర్తిచేసి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.