చండీగఢ్: జిమ్ ట్రైనర్‌ను పెళ్లాడేందుకు ఒక మహిళ తన భర్తను హత్య చేయించింది. తొలుత రోడ్డు ప్రమాదంలో చంపేందుకు ప్రయత్నించగా భర్త గాయాలతో బయటపడ్డాడు. కొన్ని నెలల తర్వాత అతడిపై కాల్పులు జరిపించడంతో మరణించాడు. (Woman got Killed husband) ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు మూడేళ్ల తర్వాత ఆ మహిళను అరెస్ట్ చేశారు. హర్యానాలోని పానిపట్‌లో ఈ సంఘటన జరిగింది. కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన వినోద్ బరారాకు నిధితో వివాహమైంది. ఆ దంపతులకు ఒక కుమార్తె ఉంది.
2021 అక్టోబర్ 5న ఇంటి సమీపంలో ఉన్న వినోద్‌ను మినీ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడి రెండు కాళ్లు విరిగాయి. అయితే ప్రాణాలతో బయటపడ్డాడు. నిందితుడైన లారీ డ్రైవర్ దేవ్ సునర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును వెనక్కి తీసుకోవాలని వినోద్‌ను సునర్ బెదిరించాడు. నిరాకరించడంతో అదే ఏడాది డిసెంబర్ 15న అతడి ఇంట్లోకి ప్రవేశించి గన్‌తో కాల్పులు జరిపి హత్య చేశాడు. సునర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో కేసు వెనక్కి తీసుకోనందుకే వినోద్‌ను చంపినట్లు పోలీసులకు చెప్పాడు.
మరోవైపు వినోద్ హత్య తర్వాత అతడి భార్య నిధి విలాసవంతంగా జీవించింది. కుమార్తెను ఆస్ట్రేలియాలోని బంధువు వద్దకు పంపింది. దీంతో వినోద్ కుటుంబ సభ్యులకు నిధిపై అనుమానం కలిగింది. ఆస్ట్రేలియాలో ఉంటున్న వినోద్ సోదరుడు ప్రమోద్, పానిపట్ ఎస్పీ అజిత్ సింగ్ షెకావత్ మొబైల్ ఫోన్‌కు కొన్ని వాట్సాప్ సందేశాలు పంపాడు. వినోద్ హత్య వెనుక లారీ డ్రైవర్‌తోపాటు మరికొంత మంది ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో కోర్టు అనుమతితో దర్యాప్తు కోసం ఒక పోలీస్ బృందం ఏర్పాటైంది.

Nidi And Sumit
కాగా, నిందితుడైన లారీ డ్రైవర్ దేవ్ సునర్ కాల్ డేటాను పరిశీలించగా జిమ్ ట్రైనర్ సుమిత్తో నిరంతరం అతడు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే సునర్ జైలులో ఉన్నప్పుడు కోర్టు ఖర్చులతో పాటు అతడి కుటుంబానికి నిధి, సుమిత్ డబ్బులు ఇచ్చి అండగా ఉన్నారని తెలుసుకున్నారు. జూన్ 7న సుమిత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడ్ని ప్రశ్నించారు. దీంతో అసలు సంగతి అతడు బయటపెట్టాడు. నిధితో వివాహేతర సంబంధం ఉన్నట్లు సుమిత్ ఒప్పుకున్నాడు. ఈ విషయం తెలియడంతో వినోద్, నిధి మధ్య గొడవలు జరిగాయని చెప్పాడు.
తొలుత లారీతో ఢీకొట్టి వినోద్‌ను చంపేందుకు నిధి ప్లాన్ చేసిందని సుమిత్ తెలిపాడు. పంజాబ్‌కు చెందిన డ్రైవర్ దేవ్ సునర్‌కు పది లక్షలు సుపారీ ఇచ్చినట్లు చెప్పాడు. ఆ ప్లాన్ పని చేయకపోవడంతో సునర్‌తో కాల్పులు జరిపించి వినోద్‌ను హత్య చేయించినట్లు వెల్లడించాడు. అలాగే సుమిత్, నిధి సన్నిహిత ఫొటోలు, వారి మధ్య జరిగిన సంభాషణలను పోలీసులు సేకరించారు. ఈ నేపథ్యంలో మూడేళ్ల తర్వాత నిధి, ఆమె ప్రియుడు సుమిత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.