చండీగఢ్: ప్లంబింగ్ పని చేసే వ్యక్తి దశ రాత్రికి రాత్రి మారిపోయింది. లాటరీలో రూ.1.5 కోట్లు గెలుచుకున్నాడు. దీంతో సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవడంతోపాటు కుమార్తె భవిష్యత్తుకు ప్లాన్ చేస్తానని వెల్లడించాడు. (Plumber Wins 1.5 Crore Lottery) హర్యానాలోని సిర్సాలో ఈ సంఘటన జరిగింది. ఖైర్పూర్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్న మంగళ్, ప్లంబింగ్ పనులు చేస్తున్నాడు. అతడు గత ఐదేళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నాడు. అయితే ఇప్పటి వరకు అదృష్టం వరించలేదు.
కాగా, మంగళ్ ఇటీవల కొనుగోలు చేసిన లాటరీలో రూ.1.5 కోట్లు గెలుచుకున్నాడు. మంగళవారం రాత్రి ఈ విషయం అతడికి తెలిసింది. దీంతో మంగళ్ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. ఇరుగు పొరుగువారితో కలిసి స్వీట్లు పంచుకుని ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.
మరోవైపు లాటరీ ద్వారా వచ్చిన డబ్బుతో తొలుత సొంత ఇంటిని ఏర్పాటు చేసుకుంటానని మంగళ్ తెలిపాడు. తన కుమార్తెకు మంచి భవిష్యత్తు కోసం మిగతా డబ్బును సేవ్ చేస్తానని మీడియాతో అన్నాడు.