Akshay | చండీగఢ్: ట్రావెల్ ఏజెంట్లను నమ్మి రూ.50 లక్షలు ధారపోసి అమెరికా వెళ్లిన ఓ హర్యానా వ్యక్తి అక్కడకెళ్లిన 5 నిమిషాలకే పోలీసుల చేతికి చిక్కారు. గత నెల 25న అమెరికా మన దేశానికి తిప్పి పంపిన చట్టవిరుద్ధ వలసదారుల్లో ఈ వ్యక్తి ఉన్నారు. హిసార్ జిల్లాలోని ఖరర్ గ్రామస్థుడైన అక్షయ్ తనను మోసగించిన ముగ్గురు ఏజెంట్లపై పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. బాధితుడు పోలీసులకు తెలిపిన కథనం ప్రకారం.. అతడిని నిరుడు జూన్లో వర్క్ వీసా మీద అమెరికా పంపిస్తామని చెప్పి ఏజెంట్లు ఈ మోసానికి పాల్పడ్డారు.
‘నన్ను చట్టబద్ధంగా విమానంలో అమెరికాకు పంపడానికి రూ.35 లక్షలు ఖర్చవుతుందని చెప్పిన ఏజెంట్లు చివరకు రూ.50 లక్షలు వసూలు చేశారు. నన్ను మొదట దుబాయ్ నుంచి సురినామ్, అక్కడ నుంచి మెక్సికో, మెక్సికో నుంచి బస్సులో అమెరికాకు తీసుకెళ్లారు. అక్కడ దిగిన 5 నిమిషాలకే పోలీసులు నన్ను అరెస్ట్ చేసి నిర్బంధ కేంద్రానికి తరలించారు’ అని బాధితుడు వాపోయారు.